సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ - గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతా..!!
ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేసారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉన్నామని..టీడీపీ గెలవటం ఖాయమని పేర్కొన్నారు. పులివెందులలో గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేసారు. అక్కడ నుంచే టీడీపీ విజయం మొదలవుతుందన్నారు. వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంగా చంద్రబాబు అభివర్ణించారు. అందులో గెలిచి మళ్లీ గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించారు. తన ఇంటిని అటాచ్ చేయటంపైనా చంద్రబాబు స్పందించారు.
మాది ప్రజాబలం:వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన వద్ద డబ్బు లేదని..తనకు ఉందని ప్రజా బలమని పేర్కొన్నారు. ప్రజా బలం ముందు ధన బలం పని చేయదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రేపు ఎన్నికలు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లిచ్చేందుకు ఐదు శాతం భూమిని రిజర్వు చేశామని చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకేచోట వేయి ఎకరాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తానంటూ పేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి తప్ప.. దేనికీ పనికిరాదన్నారు. తనకు జగన్ మాదిరిగా ప్యాలెస్ లు లేవని చెప్పారు.

కూల్చే ప్రయత్నం:తాను ఉంటున్న ఇంటికి అద్దె కడుతున్నానని చెబుతున్నప్పటికీ క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారని చంద్రబాబు విమర్శించారు. రింగురోడ్డు పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంతా కలిసే నిర్ణయించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా, టూరిజం హబ్‌గా చేయాలని భావించామన్నారు. అన్ని రాష్ట్రాలకూ రాజధానులు ఉన్నాయని.. ఏపీ రాజఽధాని ఏదంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిని సృష్టించారంటూ మండిపడ్డారు. విశాఖలో కడప, పులివెందుల రాజకీయం వద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టం చేసారు.భోగాపురం ఎయిర్‌పోర్టుకు టీడీపీ శంకుస్థాపన చేసినప్పుడు.. తాను అధికారంలోకి వస్తే ఎయిర్‌పోర్టు భూములు తిరిగిచ్చేస్తానని చెప్పిన జగన్ .. ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు.
పులివెందులలో గెలుస్తాం:కుప్పం గెలుస్తామంటున్న జగన్.. పులివెందులలో ఓడిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలు వైసీపీకి అంతిమయాత్ర కావాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి ఎన్నికల వరకు ప్రతి ఇంటిపైనా టీడీపీ జెండా ఎగురేయాలని పిలుపునిచ్చారు. అప్పులు చేసే పార్టీ వైసీపీ.. సంపద సృష్టించే పార్టీ టీడీపీదేనని వివరించారు. రూ.పది లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ రూ.2 లక్షల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు చేసారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజు ఎస్ కోటలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకించి విశాఖలో టీడీపీ అమలు చేసిన కార్యక్రమాలు..నిర్ణయాలను చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications