మాజీమంత్రికి చంద్రబాబు 'సారీ'!
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా విజయావకాశాలు తక్కువగా ఉన్నవారిని ముందుగానే గుర్తించి, వారు పార్టీలో ఎంత సీనియర్ నేతలైనాసరే సీటు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి మొహమాటానికి పోయే చంద్రబాబులో ఈ మార్పు ఏమిటో అర్థం కాక కొందరు సీనియర్ నేతలు సతమతమవుతున్నారు.
తన స్వభావానికి భిన్నంగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించేశారు. మరికొందరిని ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకోమని భరోసా ఇచ్చారు. గెలుపొందేవారికే సీటు అని చెబుతున్న బాబు అందుకు తగినట్లుగా వ్యూహాలు రచించుకుంటూ వస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆప్షన్ ఉంది.. అది విజయం సాధించడం. విజయం సాధించకపోతే ఏమవుతుందనేదానిపై ఆయనకు బాగా అవగాహన ఉండటంతో గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు రిజర్వుడు నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు టీడీపీ ఓటమిపాలైంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావును టీడీపీలోకి తీసుకున్నారు. నక్సల్స్ ఆయన్ను కాల్చి చంపడంతో కిడారి తనయుడు శ్రావణ్ కు మంత్రి పదవి ఇచ్చారు. అరకు నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాకపోవడంతో ఎన్నికలకు ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు. డిపాజిట్ కూడా దక్కని మాజీ మంత్రిగా రికార్డు సృష్టించారు.
అరకులో వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ గెలుపొందారు. రెండో స్థానంలో దొన్ను దొర నిలిచారు. కేవలం 20 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగిన శ్రావణ్ డిపాజిట్ కోల్పోయారు. ఈ సారి ఎన్నికల్లో శ్రావణ్‌కు సీటు ఇచ్చే అవకాశాలు మృగ్యం. టీడీపీలోకి వచ్చిన దొన్ను దొరకు సీటిస్తారని తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ ఛార్జిగా అరకులో టీడీపీని బలోపేతం చేయడంలో శ్రావణ్ విఫలమయ్యారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications