వస్తే వస్తారు.. లేదంటే లేదు.. మీ పని మీరు చేయండి!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో ఒంటరిపోరు చేయడానికి మానసికంగా సిద్ధమయ్యారు. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా వెళ్దామనుకుంటున్నప్పటికీ ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అది సాధ్యపడేలా కనపడటంలేదు. దీంతో చంద్రబాబు ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.

చివరి అవకాశం అంటే మొగ్గు చూపుతారా?
గత ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటి? పవన్ కల్యాణ్ కలవడంవల్ల ఒనగూరే లాభనష్టాలు.. దితర అంశాలను ఆయన క్రోడీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్ కలిసివస్తే బీసీ ఓటర్లు దూరమవుతారని, అదే క్రమంలో మొత్తం కాపులంతా టీడీపీ-జనసేనకు ఓటు వేస్తారని భావించడానికి అవకాశం లేదని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. పొత్తు లేకపోతేనే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఒక అవకాశం ఉందని, వయసురీత్యా తనకు ఇదే చివరి ఎన్నికలని, చివరి అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

ఒక్కసారి అని పవన్, మరోసారి అని జగన్
మరోవైపు పవన్ కల్యాణ్ ఒక్క అవకాశం ఇవ్వమని, ముఖ్యమంత్రి జగన్ మరోసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి ప్రయోజనమంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చింది. తాము ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో ఆ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడతారు. ఇక్కడ కులాలు, మతాలు చూడరు. అందరూ కోరుకుంటే బాబుకు సులువుగా అధికారం దక్కుతుందనే వాదన కూడా వినపడుతోంది.

పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న బాబు
ఒంటరిగా పోటీచేయడంవల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఉండటంతోపాటు బలమైన ఓటుబ్యాంకు కలిగివుంది. పవన్ కల్యాణ్ కలిసి వచ్చినా, రాకపోయినా పర్వాలేదన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చేశారని, పార్టీ యంత్రాంగాన్ని మానసికంగా సంసిద్దులను చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వెల్లడించారు.

పవన్ వస్తే కాపులంతా ఓటేస్తారా?
మధ్యతరగతి, ఉన్నతాదాయవర్గాల్లో బాబుపై అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, విజన్ ఉన్న నేత అని కొనియాడుతుంటారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతారు. బడుగు, బలహీనవర్గాల్లో ఎన్టీఆర్ వేసిన బీజం అలాగే ఉంది. అటువైపు నుంచి కొంత ఓటుబ్యాంకు వస్తుంది. పవన్ వస్తే కాపులంతా వస్తారో? రారోకానీ బీసీలంతా దూరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకొని తదుపరి కార్యాచరణ రూపొందించుకోబోతున్నారు.












Click it and Unblock the Notifications