సార్... చంద్రబాబునాయుడు ఆన్ డ్యూటీ!
రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీకా పార్టీ గెలుపు తమదేనని, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ అనంతరం కూడా అల్లర్లు జరుగుతుంటే ఆపద్ధర్మ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు.
గవర్నర్ కు లేఖ
సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు తనలో ఉన్న పాలనా దక్షతను బయటపెట్టారు. మూడు కీలక అంశాలపై సమీక్షలు జరిపారు. గవర్నర్ తోపాటు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అందులో తెలియజేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కిన సంగతి తెలిసిందే.

రాజకీయంగా లబ్ధి కలిగించుకునేందుకే ఎన్నికలకు ముందు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. పోలింగ్ అయిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయగా, ఆయన ఆదేశాల మేరకు నిధులు విడుదలయ్యాయి.
ఫలితాల తర్వాతా కేంద్ర బలగాలు
ఏపీలో అల్లర్లకు సంబంధించి కేంద్ర బలగాలను పెట్టాలంటూ ఈసీకి లేఖ రాశారు. స్పందించిన ఈసీ ఫలితాల అనంతరం కూడా రెండు వారాలపాటు బలగాలు ఏపీలోనే కొనసాగాలంటూ తీర్పునిచ్చింది. మరోవైపు ప్రభుత్వ జీవోలు దాయడానికి ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ప్రారంభించగా, అది జీవోలను తొలగించేందుకేనంటూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.
తక్షణం వాటిని నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఈసీ అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలిపివేయించింది. చంద్రబాబునాయుడు సమీక్షలు జరిపి కోరడంతో.. గవర్నర్, ఈసీ ఆమోద ముద్ర వేయడం చూస్తుంటే చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రిగా డ్యూటీ ఎక్కేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరంగా చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications