వైసీపీ నేతలే సారా వ్యాపారులు..? మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే ? : జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు..!!
పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం నాటుసారా వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అసెంబ్లీని కుదిపేసింది. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ సీఎం జగన్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో విచ్చల విడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్తీ మద్యానికి కేరాఫ్‌గా ఏపీ..
కల్తీ మద్యానికి కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, నాటు సారా ఏరులై పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో పర్యటించిన చంద్రబాబు.. కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున మొత్తం 26 కుటుంబాలకు సాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు.

మద్యం వ్యాపారి సీఎం జగన్..
రాష్ట్రంలో మధ్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు ఎందుకు అమలు చేయడంలేదని చంద్రబాబు నిలదీశారు. ఎక్కడ చూసినా మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని మండిపడ్డారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డే వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ సారా నియంత్రించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తమను జైలులో పెట్టినా, కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..
సారా మరణాలన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సిగ్గులేకుండా సీఎం జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సహజ మరణాలనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది కల్తీ మద్యం తాగి మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సారా వ్యాపారం చేస్తుందని వైసీపీ నేతలేనని ఆరోపించారు. మద్యపాన నిషేదమంటూ వైసీపీ నేతల సొంత బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఈ నాటుసారా దొంగలను పట్టుకుని కేసు పెట్టేవరకు ఊరుకోనేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
Recommended Video

సహజ మరణాలపై రాజకీయం..
జంగారెడ్డిగూడెంలో మృతుల ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. టీడీపీ నేతలు శవరాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా అణిచివేస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో లాభాపేక్షతో మద్యం అమ్మకాలు జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పూర్తిగా నియంత్రణ విధించామని తెలిపారు. జంగారెడ్డి గూడెంకు చంద్రబాబు బలప్రదర్శనకు వెళ్లారా..? లేక పలకరింపుకు వెళ్లారా ? అని ప్రశ్నించారు. ప్రతిది రాజకీయం చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications