
తెలుగుదేశం పార్టీ లక్ష్యం 160... నేతలకు ప్రణాళిక ఇచ్చిన చంద్రబాబునాయుడు?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో 160 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొలిట్‌బ్యూరో సభ్యులతోను, సీనియర్ నేతలతోను వ్యక్తిగతంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన రూపొందించిన ప్రణాళికను త్వరలోనే నేతలకు, జిల్లాల అధ్యక్షులకు అందజేయబోతున్నారు. ఇకనుంచి ఆ ప్రణాళిక ప్రకారం వారంతా పనిచేయాల్సి ఉంటుంది.
గుడివాడ మినీ మహానాడు తర్వాత జరగబోయే మహానాడుల్లోను, ఇతర జిల్లాల పర్యటనల్లోను తెలుగుదేశం పార్టీ మొత్తం 160 స్థానాలు సాధించబోతుందనే మాటే ప్రచారం కాబోతోంది. ఇందుకు తగ్గట్లుగా పార్టీ శ్రేణులను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పార్టీ అధినేత భావిస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బాదుడే బాదుడుతోపాటు మహానాడులోను ఈ విషయం తేటతెల్లమైందని, ఎట్టి పరిస్థితుల్లోను ఈ రెండు సంవత్సరాలు నాయకులు, కార్యకర్తలు కష్టపడితే విజయం సులువుగా దక్కుతుందని చంద్రబాబు చెబుతున్నారు.
తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉండటాన్ని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తథ్యమని బాబు స్పష్టం చేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఓట్లరూపంలో ఎలా మలచుకోవాలనేదే చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక. ప్రస్తుతానికి దాన్ని బహిర్గతం చేయనప్పటికీ రాబోయే రోజుల్లో పార్టీ సీనియర్ నేతలు, జిల్లాల అధ్యక్షులు దానిప్రకారమే పనిచేయబోతున్నారని, వారి పనితీరును బట్టి ఆ పార్టీ వ్యూహరచన ఏమిటనేది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.