BJP కోర్టులోకి బంతి విసిరిన చంద్రబాబు!!
తెలంగాణలో ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలనేది భారతీయ జనతాపార్టీ లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకపోవడంతోపాటు బలమైన నాయకులు లేకపోవడం ప్రధానమైన లోటుగా మారుతోంది. ఆసరా కోసం కార్యకర్తల బలం ఉన్న పార్టీ అవసరపడుతోంది. అది తెలుగుదేశం పార్టీ రూపంలో కనపడుతోంది. కానీ పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనే సందిగ్ధత మధ్య ఢిల్లీ అధిష్టానం ఊగిసలాడుతోంది.

తెలుగుదేశం కోసం తెలంగాణ బీజేపీలో 2 వర్గాలు
గతంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు టీడీపీని పూర్తిగా యాక్టివ్ చేయించి పొత్తులు పెట్టుకోవాలని అధిష్టానానికి సూచించారు. అయితే మరోవర్గం నేతలు టీడీపీతో పొత్తును ఇష్టపడలేదు. మరోవైపు చంద్రబాబునాయుడికి బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం అవసరం. రానున్న ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎదుర్కోవడం అంత సులభం కాదని తెలుసు. కేంద్రం నుంచి సహకారం ఉంటేనే ఎదుర్కోగలుగుతామని భావిస్తున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు.

బలాన్ని చూపించిన చంద్రబాబు
తెలంగాణలో చంద్రబాబు బలాన్ని నరేంద్రమోడీ, అమిత్ షా వద్ద తక్కువ చేసి చూపించిన వర్గానికి మింగుడు పడని రీతిలో ఖమ్మంలో సభ నిర్వహించామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఒకరకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వర్గంగా ఉన్న బీజేపీ నేతలు కూడా దీనిపై సంతోషించారు. దాదాపు ఎనిమిది సంవత్సరా ల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు ర్యాలీ గా వెళుతుంటే తెలంగాణ ప్రజలు నిబిడాశ్చర్యానికి గురయ్యారు. రాజకీయ పార్టీలైతే అయోమయానికి గురయ్యాయి.

బీజేపీ కోర్టులో బంతి?
తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఇంత ఆదరణ ఉందా అని షాకయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీ పెద్దలకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుతో కలిసి పనిచేసేలా పార్టీ అధిష్టానంలో కదలిక తీసుకురాగలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. బీజేపీకి నాయకుల బలం లేకపోవడంతో ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావచ్చని బీఆర్ ఎస్ వ్యూహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాలు మాని ఎన్నికలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ బలం రోజురోజుకు తగ్గుతోందని అంచనా వేస్తున్న బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూస్తోంది. సింగిల్ గా వెళితే అధికారం దక్కుతుందన్న నమ్మకం లేదు. ఏదో ఒక ఆసరా అవసరమవుతోంది. ఆ ఆసరాను తాను ఇస్తానంటోంది టీడీపీ. ఈ తరహాలో చంద్రబాబు తెలంగాణ రాజకీయంపై దృష్టిసారిస్తారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరూ ఊహించలేదు. కానీ చంద్రబాబు తాజా సభ తర్వాత తెలంగాణలో రాజకీయం మొత్తం మారిపోయింది. బీజేపీ కోర్టులో బంతి ఉండటంతో ఏం తేలుస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications