గోదావరి జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక సర్వే
గోదావరి జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. మరోవైపు వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువైన పనికాదని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఎక్కడిక్కడ ఆయన వ్యూహాత్మకంగా తన ప్రణాళికలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. జనసేనతో పొత్తుకానీ, నారా లోకేష్ పాదయాత్రకానీ ఇవన్నీ అందులోనివే.

ఇక్కడ ఆధిపత్యం ఉంటే ప్రభుత్వం ఏర్పాటే..
గోదావరి జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోను 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఈ రెండు జిల్లాల్లో 5చోట్ల మాత్రమే విజయం దక్కించుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గోదావరి జిల్లాలపై దృష్టిపెట్టారు. పొత్తులో భాగంగా రాష్ట్రమంతటా సీట్లు తీసుకునేబదులు తనకు బలమున్న జిల్లాల్లో సీట్లు తీసుకోవాలనేది పవన్ యోచనగా ఉంది. కాపు సామాజికవర్గం, క్షత్రియ సామాజికవర్గం ఎక్కు ప్రభావం చూపించే ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక సర్వే నిర్వహింపచేశారు.

పుంజుకున్న తెలుగుదేశం పార్టీ
ఈ మూడున్నర సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పార్టీ అనూహ్యంగా పుంజుకున్నట్లు తేలింది. బలమైన ఓటుబ్యాంకు కలిగిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో జగన్ హవాలో దాన్ని కోల్పోయింది. పవన్ కల్యాణ్ కూడా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు అడుగుతుండటం, ఈ జిల్లాల్లో టీడీపీకి బలమైన ఓటుబ్యాంకు ఉండటంతో ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి, ఓటరు నాడి పసిగట్టడానికి ఈ సర్వే చేశారు. టీడీపీ-జనసేన కలిస్తే ప్రభావం బాగుంటుందని, ఇరు పార్టీలకు సానుకూల పవనాలు ఉన్నట్లు తెలిపింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 49 శాతం ఓటుబ్యాంకు ఉంది

పొత్తు లేకపోయినా పెరిగిన గెలుపు అవకాశాలు
పొత్తు లేకపోయినా ఒంటరిగా పోటీచేసినా గెలుపు అవకాశాలున్నట్లు తేలింది. సిట్టింగ్ స్థానాలను తిరిగి గెలుచుకోవడంతోపాటు ఓటుబ్యాంకు శాతం కూడా పెరిగినట్లు స్పష్టమైంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ పోరు తథ్యమని తేలింది. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే నియోజకవర్గాలను జనసేన కోరుతోంది. ఉండి, పాలకొల్లు, దెందులూరు, ముమ్మిడివరం, అనపర్తి, పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమని, అటువంటివి తమదగ్గరే అట్టిపెట్టుకొని వైసీపీతో హోరాహోరీ పోరు జరిగే కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ఏలూరు లాంటి స్థానాలను జనసేనకు బదలాయించాలని చూస్తోంది. చివరకు ఏ పార్టీకి ఏ నియోజకవర్గం కేటాయిస్తారో అధికారికంగా ప్రకటించినప్పుడు మాత్రమే ఒక స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications