బీజేపీతో పొత్తు వేళ చంద్రబాబు కీలక అడుగు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్దులను ఫైనల్ చేసి ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. ఈ సమయంలో బీజేపీ కలిసి రావాలని రెండు పార్టీలో కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పొత్తు పైన స్పష్టత రావటం లేదు. ఈ సమయంలోనే చంద్రబాబు కీలక అడుగు వేసేందుకు నిర్ణయంచారు.
పొత్తుల లెక్కలు: ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ సైతం తమతో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. తాజాగా చంద్రబాబు, పవన్ భేటీలోనూ బీజేపీ పొత్తు అంశం చర్చకు వచ్చింది.

ఈ నెలాఖరు వరకు వేచి చూసి బీజేపీ నుంచి స్పందన రాకపోతే ఏపీలో సీపీఐతో పొత్తుతో ముందుకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో జనసేనతోనే తమ పొత్తు అని పదే పదే చెబుతున్న బీజేపీ కూటమిగా టీడీపీతో కలిసే అంశం పైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసారు.
అయోధ్యకు చంద్రబాబు: ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా చంద్రబాబు, పవన్ ను రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ ఆహ్వానించింది.
ప్రధాని మోదీ ఆలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు అయింది. ఆ ముహూర్తాన ప్రతీ ఇంటా దీపం వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో, కీలకమైన ఈ సమయంలో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 21న సాయంత్రం చంద్రబాబు అయోధ్య వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

పొత్తు ఖాయమయ్యేనా: జనసేనాని పవన్ సైతం అయోధ్య వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ద్వారా బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో పొత్తు కారణంగా కొన్ని వర్గాల ఓట్లు కోల్పోతామని సీనియర్లు చెబుతున్నారు.
దీంతో, బీజేపీతో పొత్తు కోసం చివరి ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది, అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత ఏపీలో పొత్తులపైన బీజేపీ తుది నిర్ణయం తీసుకుంటుదని భావిస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోతే పవన్ నిర్ణయం కీలకం కానుంది. దీంతో చంద్రబాబు అయోధ్య పర్యటన తరువాత పొత్తు పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications