'జాతిరత్నాల' జాబితా తెప్పించుకున్న చంద్రబాబు!
పనితీరు మార్చుకోని నేతలను పక్కకు తొలగించాలనే కఠిన నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చారు. మొదటి నుంచి ఆయన ఈ విషయం చెబుతున్నప్పటికీ నియోజకవర్గాల్లోని నేతలెవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తాజాగా జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సీటిచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

చర్యలు తప్పవని హెచ్చరిక
పార్టీ కార్యక్రమాలు చేస్తున్నట్లు నటించేవారెవరనేది తన దగ్గర జాబితా ఉందని, ఆ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అటువంటి నేతలకు తనకు అవసరంలేదని, పార్టీ కోసం ఈ మూడు సంవత్సరాలు కష్టపడి జైలుకెళ్లి, పోలీసులచేత దెబ్బలు తిన్నవారే తనకు కావాలని, మొదటి శ్రేణి నేతలంతా ఇంట్లో కూర్చుంటే ద్వితీయశ్రేణి నాయకులంతా పార్టీకోసం కష్టపడ్డారని, వారికే రేపు పార్టీపరంగా మొదటి ప్రాధాన్యమని బాబు స్పష్టం చేశారు. ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్నప్పటికీ సీనియర్ నేతల పనితీరులో మార్పురావడంలేదని మండిపడ్డారు.

ఇన్ ఛార్జిలే అభ్యర్థులు?
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జిలను నియమించలేదు. కొందరిని మాత్రమే నియమించారు. రానున్న ఎన్నికల్లో దాదాపుగా వారే అభ్యర్థులవుతారు. కానీ ఇంకా ఇన్‌చార్జిలను నియమించని స్థానాల్లో పార్టీకోసం కష్టపడినవారికి ప్రాధాన్యం ఇవ్వడానికి బాబు సమాయత్తమవుతున్నారు. అందుకు అన్నిరకాలుగా వారి ఆదుకోవడానికి, ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయనకు మొహమాటం ఎక్కువ.. మనకేం ఇబ్బంది ఉండదులే అనుకుంటున్నవారందరికీ తాజాగా జరిగిన సమావేశంలో బాబు షాకిచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి పోలీసుల కేసుల నుంచి కాపాడటానికి నాయకుల కోసం న్యాయవాదుల నియామకాన్ని చేపట్టబోతున్నారు.

డైలామాలో సీనియర్ నేతలు!
దీంతో నియోజకవర్గాల్లోని నేతలంతా డైలామాలో పడ్డారు. తమ పనితీరుపై ఎప్పటికప్పుడు అధినేత సమాచారం తెప్పించుకుంటుండటంతో తాము ఏం చెప్పినా నమ్మరని అర్థమైంది. మొదటి నుంచి పార్టీకోసం కష్టపడితే ఈరోజు ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావని నిట్టూరుస్తున్నారు. న్యాయవాదులద్వారా జైలులో ఉన్న పార్టీ నాయకులకు న్యాయ సహాయం అందించి ముందుగా వారిని బెయిల్ పై బయటకు తీసుకురానున్నారని, ఆ తర్వాత వారి సమర్థులను గుర్తించి ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలుగా పెట్టబోతున్నట్లు టీడీపీ కేంద్ర కార్యాలయవర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications