ఎన్నికల వేళ చంద్రబాబు వెనుకడుగు - ప్రాతినిధ్యం కోల్పోయినట్లే..!?
ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్దులు ఖరారయ్యారు. వైసీపీ మూడు స్థానాలు గెలవటం ద్వారా టీడీపీ ఆవిర్భావం తరువాత తొలి సారి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో టీడీపీ ఒక అభ్యర్దిని పోటీకి దింపాలని కసరత్తు చేసింది. కానీ, ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ, బీజేపీ, టీడీపీ నుంచి ఒక్కొక్క సభ్యుడు పదవీ విరమణ చేయనున్నారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఒక్క సభ్యుడే పెద్దల సభలో ఉన్నారు. ఆయన పదవీ విరమణ వేళ..పార్టీ ప్రాతినిధ్యం సభలో లేకుండా కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో, ఈ సారి ఎన్నికల్లో ఒక సీటు గెల్చుకోవాలని టీడీపీ కసరత్తు చేసింది.

వైసీపీ తమ ముగ్గురు అభ్యర్దులను ఖరారు చేసింది. రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఒక్కో అభ్యర్దికి 44 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారు మరో 26 మంది సభ్యుల మద్దతు అవసరం. వైసీపీలో సీట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మారుతారని టీడీపీ అంచనా వేసింది.
సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేల్లో కొందరితో నేరుగా సీఎం జగన్ మంత్రాంగం చేసారు. సీట్లు దక్కని కొందరు తాము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేసారు. బీజేపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని యోచన చేసారు. అయితే, బీజేపీ తో పొత్తు వ్యవహారం తేలటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నామినేషన్లకు సమయం తక్కువగా ఉంది.
ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటం ద్వారా ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అంశం పైనా టీడీపీ ఆరా తీస్తోంది. దీంతో, రాజ్యసభ కంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావటం టీడీపీకి ప్రధాన అంశంగా మారుతోంది. దీంతో..రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications