గన్నవరం టీడీపీ ఇన్ ఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావు-టార్గెట్ ఆ ఇద్దరేనన్న లోకేష్...
ఏపీలోని కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గం గన్నవరంలో తాజాగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు ఇవాళ శుభవార్త అందింది. గన్నవరం అసెంబ్లీ టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఆయన్ను నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. గన్నవరంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ యార్లగడ్డను ఇన్ ఛార్గ్ గా ప్రకటించారు.
గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నట్లు నారా లోకేష్ ఇవాళ వెల్లడించారు. పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసిపినేతలు, వారి అనుచరులతో యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీ కంచుకోట గన్నవరం అని, ఎందరో గొప్పవ్యక్తులు ఎమ్మెల్యేలుగా గన్నవరం నుండి ఎన్నికయ్యారని లోకేష్ తెలిపారు. గతంలో తాము చేసిన తప్పువల్లే గన్నవరం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. హేమాహేమీలను కాదని పేరు కూడా తెలియని వంశీని ఎమ్మెల్యేను చేశామన్నారు. 2019లోనూ భిన్నాభిప్రాయాలున్నా రెండోసారి వంశీని ఎమ్మెల్యేను చేశామన్నారు. ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేసే వంశీ ఆనాడు ఎందుకు బి.ఫామ్ తీసుకున్నాడని ప్రశ్నించారు.

రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, దేవుడు అన్నిరకాల పరీక్షలు పెడతారని, వాటిని తట్టుకున్నవారే నిలబడతారని లోకేష్ తెలిపారు. తనపై, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు పెట్టిందని, గన్నవరం టీడీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి, పార్టీ కార్యాలయంపైనా ఈ పిల్లసైకో దాడులు చేయించాడని వంశీని ఉద్దేశించి లోకేష్ విమర్శించారు. అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వంశీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం గడ్డపై టిడిపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలన్నారు. దివంగత నేత బచ్చుల అర్జునుడు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లసైకో వైసీపీలోకి వెళ్లిన తర్వాత ధైర్యంగా బచ్చుల అర్జునుడు ముందుకు వచ్చారని, అంచలంచెలుగా అర్చునుడు పార్టీలో ఎదిగారని లోకేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications