మేమిచ్చేదే మెయిన్!! ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాం?
తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై కూర్చెబట్టడమే ఆయన లక్ష్యం. 2024లో ఎన్నికలు జరగబోతుండగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమిటి? నియోజకవర్గాలవారీగా నాయకులు ఏం చేస్తున్నారు? వారిలో పనిచేసేవారెవరు? పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం కలిగినవారెవరు? బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి?... తదితర అంశాలపై రాబిన్ శర్మ బృందం సర్వే ప్రారంభించింది.

సీనియర్ నేతలకు కష్టాలేనా?
తాజాగా ప్రారంభమైన ఈ సర్వే ప్రధాన ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గుర్తించడమే. పార్టీ ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. మహానాడు వేదికగా ఈ విషయమై స్పష్టతనివ్వడంతోపాటు తాజాగా రాబిన్ శర్మ సర్వే ప్రారంభించడంతో పార్టీలోని సీనియర్ నాయకులకు కష్టాలు ప్రారంభమైనట్లేనని భావించవచ్చు.
వ్యూహకర్తగా నియమితులయ్యారు కాబట్టి తామిచ్చిన సర్వే ప్రకారం పార్టీలో చర్యలు తీసుకోవడంతోపాటు కార్యకలాపాలుండాలని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

గెలుపే పార్టీకి ప్రాతిపదిక
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపోటములే ప్రాతిపదికకానీ వేరే ఇతర అంశాలేవీ కావని అధినాయకత్వం తెలియజేసింది. రాబిన్ శర్మ తన సర్వేద్వారా అభ్యర్థుల జాబితాను తయారుచేయబోతున్నారు.
సీనియర్ నేతల పేర్లు కొన్ని ఇందులో ఉండే అవకాశాలేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా నియమితులైన తర్వాత వారు చెప్పినదాని ప్రకారం చేయాల్సిందేనని, సీట్ల కేటాయింపు కూడా వారిచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుందని భావిస్తున్నారు.

చంద్రబాబు మొహమాటమే పార్టీని ఓడిస్తోంది
చంద్రబాబునాయుడు మొహమాటంకొద్దీ, సీనియర్ అన్న ఉద్దేశంతో టికెట్ కేటాయిస్తే అది పార్టీ ఓటమికి దారితీస్తోంది. రానున్న ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించారుకాబట్టి సీనియర్ నేతలను తగ్గించుకుంటూ వస్తున్నారు. లోకేష్ కు, సీనియర్ల కు మధ్య జనరేషన్ గ్యాప్ ఉండటంతో యువతరాన్ని సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో వెల్లడికానున్న రాబిన్ శర్మ నివేదిక ప్రకారం జాబితాలో చోటు కోల్పోయే సీనియర్లెవరు? కొత్తగా సీటు దక్కించుకునే యువతరం ఎవరు? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications