జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు - రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది..!!
టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనలో చేరుతారని భావించిన వారు టీ డీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో మాజీలు జనసేన బాట పడుతున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
పార్టీ ఆవిర్భావ సదస్సులో జనసేనాని కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరకలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరనున్నారు. బీసీ రౌండ్ టేబుల్ నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఈ రోజు కాపు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటనకు జనసేన సిద్దం అవుతోంది.

జనసేనలోకి ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు
టీడీపీ నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు జనసేనలో చేరనున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 1994లో హరిబాబు టీడీపీ ఎమ్మెల్యేగా పని చేసారు. ఆ తరువాత ఆయనకు అవకాశం దక్కలేదు. 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తరువాత బీజేపీలో చేరారు.
ఇప్పుడు జనసేనలో చేరాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా జనసేనలో చేరుతున్నారు. 2009లో కొవ్వూరు నుంచి రామారావు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో వైసీపీలో చేరారు.
అక్కడ పదవి ఆశించినా దక్కలేదు. తనకు ప్రాధాన్యత దక్కటం లేదంటూ తాజాగా వైసీపీకి రాజీనామా ప్రకటించారు. జనసేనలో చేరుతారని ప్రచారం సాగినా..ఆయన ఖండించారు. కానీ, ఇప్పుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ రోజు ఈ ఇద్దరు జనసేనలో చేరనున్నారు.

రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది
టీడీపీ - జనసేన మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ, చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అనేక రకాల చర్చలకు కారణమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. కానీ, ఎవరికి వేయాలనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అటు బీజేపీ..ఇటు టీడీపీ రెండు పార్టీల అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
బీజేపీ ఇప్పటికీ పవన్ తమతోనే ఉన్నారని చెబుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకుంటోంది. ఎక్కడా జనసేన ప్రస్తావన లేదు. జనసేనలో చేరుతారని భావించిన కన్నా టీడీపీలో చేరారు. మరి కొందరు బీజేపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. జనసేన సొంతంగా ఎన్నికల హామీలు ఇస్తోంది. తాజాగా జరిగిన బీసీల సమావేశంలోనూ జనసేన అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత పైన పవన్ ప్రకటన చేసారు.

ఆవిర్భావ సభలో క్లారిటీ ఇస్తారా
ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇందు కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు పైన పవన్ సంకేతాలు ఇవ్వటం మినహా స్పష్టత ఇవ్వటం లేదు. అటు బీజేపీతో మైత్రి గురించి వారాహి పూజల సమయంలో కొండగట్టులో కీలక వ్యాఖ్యలు చేసారు. తాము ఇంకా బీజేపీతో పొత్తుతో ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు బీజేపీ నేతలు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ నేతలు ఎక్కడా జనసేన గురించి ప్రస్తావన చేయటం లేదు. జనసేన నుంచి టీడీపీ ..బీజేపీ పైన కామెంట్స్ లేవు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ వరుసగా తమ అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. జనసేన మాత్రం వేచి చూసే ధోరణితో ఉంది.
పార్టీ ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ డైలమాకు పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ ప్రకటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications