నేడే టీడీపీ సర్వసభ్య సమావేశం...పార్టీ నిర్ణయాలపై చర్చ
Recommended Video

అమరావతి: చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు జరుగనుంది. ఈ టిడిపి సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతం చేయడం, ధర్మ పోరాట దీక్షల తదుపరి షెడ్యూల్ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు టీడీపీ పార్లమెంటరీ సమావేశం కూడా జరుగనుంది. జులై 18 నుంచి జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

టీడీపీ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులవుతున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న గ్రామదర్శిని, పట్టణ దర్శిని కార్యక్రమం విధివిధానాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ధర్మ పోరాట దీక్షల తదుపరి షెడ్యూల్, శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలు కోసం తెదేపా ఎంపీలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించేందుకు శాసనసభ సమావేశాలూ నిర్వహించాలన్న ప్రతిపాదనపై పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలోను, బయటా ఎంపీలు చేయాల్సిన పోరాటంపైనా గురువారం జరిగే సమావేశంలో ఒక వ్యూహాన్ని సిద్దం చేయనున్నారు.
జమిలి ఎన్నికలపై పార్టీ తన వైఖరిని జాతీయ న్యాయ కమిషన్‌కు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం, అన్నివర్గాలకూ పార్టీని చేరువ చేయడం, ఎన్నికలకు సంసిద్ధత వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరుపుతారు.












Click it and Unblock the Notifications