నాపై రౌడీషీట్ ఎత్తేయండి!: బాబుకు భూమా నాగిరెడ్డి, ఏం జరిగిందంటే..
కర్నూలు: తన పైన ఉన్న రౌడీషీట్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నంద్యాల ఎమ్మెల్యే, టిడిపి నేత భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ విషయమై విన్న వించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
2014లో నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘర్షణలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి పైన పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తనపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆయన వినతిని పరిశీలించాలని కోరుతూ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. కేసు ఎత్తివేత విషయంపై మరికొన్ని రోజుల్లో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వవచ్చునని అంటున్నారు.
భూమా పైన రౌడీషీట్ ఎత్తివేస్తే అది చర్చనీయాంశంగా మారే అవకాశముంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, పార్టీ మారగానే కేసులు ఎత్తి వేస్తే ప్రజల్లోకి మరో అభిప్రాయం వెళ్తుందని టిడిపిలో వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 2014 అక్టోబర్ 31ని నిర్వహించారు. చివరలో రోడ్ల విస్తరణ పైన భూమా నాగిరెడ్డి మాట్లాడుతుండగా.. సమావేశం ముగిసిందని అధికార పార్టీకి చెందిన చైర్ పర్సన్ సులోచన బెల్ కొట్టారు. ఇది ఇరువర్గాల మధ్య దాడుల దాకా వెళ్లింది.
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సెలర్లు గాయపడ్డారు. చైర్ పర్సన్ చాంబర్ అద్దాలు పగిలాయి. గాయపడిన కౌన్సెలర్లను సమావేశం ముగిశాక మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ కుమార్ పరామర్శించి వస్తుండగా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనల పైన మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి, ఫరూక్‌లు టూటౌన్ పోలీసు స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేశారు.
దీనిపై దళిత కౌన్సెలర్ అనిల్ అమృతరాజన్‌ను అవమానించారంటూ అట్రాసిటీ కేస, విజయ్ కుమార్ పైన హత్యాయత్నానికి కుట్ర పన్నినట్లు భూమాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వెంటనే రాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేసి విచారించారు. మరుసటి రోజు భూమా, ఆయన అనుచరులైన ఏడుగురు కౌన్సిలర్లపై రౌడీషీట్ నమోదైంది.












Click it and Unblock the Notifications