బాబే సిఎం అని స్లోగన్స్, ఆ ఏడింట తేలిపోయిన తెరాస
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే సీమాంధ్ర ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో, సీమాంధ్ర జిల్లాల్లో నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ ఫలితాలలో టిడిపి జోరు కనిపించిన విషయం తెలిసిందే.
సీమాంధ్రలో టిడిపి 64, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 19 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. దీంతో టిడిపిలో నూతనోత్సాహం కనిపించింది. సీమాంధ్రలో 70 శాతానికి పైగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాణా సంచా కల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, సీమాంధ్ర సిఎం చంద్రబాబే అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
అక్కడ ఖాతా తెరవని తెరాస
తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఖాతా తెరువలేదు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఉనికిని చాటుకోలేకపోయింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, నల్గొండ జిల్లాలోని భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్ పేట, బడంగ్ పేట మున్సిపాలిటీల్లో తెరాస ఒక్క స్థానంలో కూడా గెలువలేదు.












Click it and Unblock the Notifications