రాజధాని అమరావతి వేదికగా రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు
Chandrababu Naidu, Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. తెలుగు ప్రజలు భోగి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.
Recommended Video

తెలుగుదేశం- జనసేన పార్టీ ఉమ్మడిగా భోగి వేడుకలను నిర్వహించాయి. గుంటూరు జిల్లా మందడంలో ఏర్పాటు చేసిన భోగీ వేడుకల్లో ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, మాగంటి బాబు.. పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలిపారు.

ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుజాతికి స్వర్ణయుగం- సంక్రాంతి సంకల్పం' అనే కాన్సెప్ట్‌తో ఈ వేడుకలను నిర్వహించారు. తొలుత చంద్రబాబు, పవన్ కల్యాణ్ భోగీ మంటలను వెలిగించారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేనిఫెస్టో కాపీలు, కొన్ని జీవోలను అందులో తగులబెట్టారు. నాగలి, చెర్నాకోళ, కోడిపుంజును పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగించారు. సమాజ శ్రేయస్సు, రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సంకల్పాన్ని తీసుకున్నామని, ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం ఈ ప్రాంత రైతులు 33,000 ఎకరాలను తృణప్రాయంగా నాటి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాంటి రైతులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు.

రైతులందరికీ తాము మాట ఇస్తున్నామని, వారి త్యాగాన్ని విస్మరించబోమని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ ఉద్దేశం కోసం పంట పొలాలను అందజేశారో.. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేలా కృషి చేస్తామని, బంగారు రాజధానిని నిర్మిస్తామని తేల్చి చెప్పారు. అయిదు కోట్ల మంది ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగాన్ని వృధాగా పోనివ్వమని అన్నారు.
ఇకపై జై అమరావతితో పాటు జై ఆంధ్రా అనే నినాదాన్ని కూడా తీసుకోవాలని పవన్ కల్యాణ్.. ఈ ప్రాంత రైతులకు సూచించారు. జై అమరావతి అని చెప్పడం వల్ల ఇక్కడి సమస్య రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావట్లేదని, అదేదో ఈ ప్రాంత సమస్యగా భావిస్తున్నారని చెప్పారు. జై అమరావతి- జై ఆంధ్రా అని నినదించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెడగొట్టారని విమర్శించారు. సరిగ్గా 87 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అమరావతి ప్రాంత రైతుల హక్కులను పరిరక్షించాలని ఈ సంక్రాంతికి సంకల్పం తీసుకున్నామని, ఎన్నికల తరువాత దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications