చంద్రబాబు-పవన్ కల్యాణ్: 'కెమిస్ట్రీ' బాగుంది.. 'మ్యాథ్స్' వీక్...?
వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాలనుకుంటున్న తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య 'కెమిస్ట్రీ' బాగుందికానీ 'మ్యాథ్స్' మాత్రం వీక్ గా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో టీడీపీతో కలిసి జనసేన కూడా పాల్గొంటోంది. ఇరు పార్టీలు మంచి అవగాహనతో కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే 'లెక్కల' దగ్గరకు వచ్చేసరికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంలేదు. 'లెక్కల్లో' చంద్రబాబు, పవన్ కల్యాణ్ బలహీనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెగని పొత్తుల పంచాయితీ?
అంతా బాగానే ఉన్నప్పటికీ పొత్తుల పంచాయితీ మాత్రం తెగడంలేదు. అంతర్గతంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ఒక స్పష్టత వస్తేకానీ బహిరంగంగా ప్రకటించే అవకాశం కనపడటంలేదు. ముందుగా పొత్తు ప్రకటించి తర్వాత సీట్ల గురించి చర్చించుకుంటే కాలయాపనతోపాటు సమయం వృథా అవుతుందనే భావనలో చంద్రబాబు, పవన్ ఉన్నారు. బీజేపీ కలిస్తే ఒక 'లెక్క'గా ఉంటుంది.. లేదంటే మరో 'లెక్క'గా ఉండబోతోంది.

టీడీపీ, జనసేన తులాభారం
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుకన్నా తనకు బలమున్న ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలోనే ఎక్కువ సీట్లు కేటాయించామని జనసేన డిమాండ్ గా ఉంది. 25 నుంచి 30 సీట్లవరకే టీడీపీ తులాభారం తూగుతోంది. జనసేన తులాభారం మాత్రం 40 సీట్లు లక్ష్యంగా తూగుతోంది. ఏయే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలనేది చంద్రబాబు ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్నిచోట్ల తఖరారు తప్పడంలేదంటున్నారు.

చివరకు ఎన్ని సీట్లు దక్కుతాయో?
ఉమ్మడి విశాఖపట్నంలోని చోడవరం, యలమంచిలి, గాజువాక, భీమిలీ, విశాఖ నార్త్ సీట్లు అడుతుతోంది. ఇవన్నీ టీడీపీకి బాగా బలమున్న నియోజకవర్గాలు కావడం గమనార్హం. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు సీట్లు, పశ్చిమ గోదావరిలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, కృష్ణా జిల్లాలో కైకలూరు, విజయవాడ పశ్చిమ, గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు తూర్పు, ప్రకాశం జిల్లాలో దర్శి, చీరాల, గిద్దలూరు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి సీట్లు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. గుంటూరు పశ్చిమ కోసం జనసేన పట్టుబడుతుండగా తూర్పు కేటాయించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications