AP MLC Election: ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్లు-ఎన్నిక లాంఛనమే ?
ఏపీ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా సీట్లకు అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఎన్డీయే కూటమికి చెందిన ఇద్దరు అభ్యర్ధులు సి రామచంద్రయ్య (టీడీపీ), పి హరిప్రసాద్ (జనసేన) నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్దులుగా పోటీ పడనున్నారు. అసెంబ్లీ కార్యదర్శి సమక్షంలో వీరు తమ నామిషన్ పత్రాలను సమర్పించారు.
గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే వైసీపీ నేతల ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా టీడీపీలో చేరగా.. ఆయనపై కూడా అనర్హతా వేటు పడింది. దీంతో ఎమ్మెల్యేల కోటాలో రెండు స్ధానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఈసారి తిరిగి రామచంద్రయ్యను టీడీపీ ఎంపిక చేయగా.. జనసేన నుంచి పి హరిప్రసాద్ అభ్యర్ధిత్వం ఖరారు చేశారు. దీంతో వీరిద్దరూ ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు.

రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి తేదీ. రేపు అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించనున్నారు. అనంతరం అభ్యర్థులు జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంది. అప్పటివరకూ ఇతర నామినేషన్లు రాకపోతే వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటిస్తారు.













Click it and Unblock the Notifications