బీజేపీ విషయంలో టీడీపీ-జనసేన తాజా లెక్క ఇదే ? తెలంగాణ ఎన్నికల వరకూ..
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో టీడీపీతో బహిరంగంగానే జట్టు కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు. అయితే అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఆ పార్టీతో సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై భిన్నవాదనలు వినిపించాయి. అప్పటి నుంచి బీజేపీ నేతలు కూడా పవన్ విషయంలో మౌనం వహిస్తున్నారు. దీంతో పవన్ కూడా తాజాగా టీజింగ్ మొదలుపెట్టారు.
తాజాగా పెడన వారాహి యాత్ర బహిరంగసభలో మాట్లాడిన పవన్ యథాలాపంగానే ఎన్డీయే నుంచి బయటికి వచ్చి టీడీపీకి మద్దతివ్వాల్సి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్డీయే నుంచి జనసేన బయటికి వచ్చేసిందా అన్న చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన జనసేన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో తాత్కాలికంగా ఈ వివాదానికి తెరపడినట్లయింది. అయితే బీజేపీ విషయంలో టీడీపీ-జనసేన పార్టీలు ఏ అభిప్రాయంతో ఉన్నాయనే చర్చ మాత్రం మొదలైంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై ధర్మపోరాటం చేసి తీవ్రంగా నష్టపోయిన చంద్రబాబును ఆ అనుభవాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. అలాగని బీజేపీ ముందు చేతులు కట్టుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు ముందుకు వెళ్లడం లేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు కావడంతో ఇది కేంద్రానికి తెలియకుండా జరగదని భావించిన టీడీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీపై వార్ కు దిగింది. కానీ బహిరంగంగా మాత్రం టీడీపీ నేతలు బీజేపీపై కానీ, కేంద్రంపై కానీ మాట్లాడటం లేదు.
అటు పవన్ కూడా ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అన్న దానిపై బహిరంగంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేరు. కానీ ఎన్డీయేలో ఉంటూనే అదే ఎన్డీఏలో లేని టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసేశారు. తద్వారా ఎన్డీయేపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం తర్వాత పవన్ విషయాన్ని బీజేపీ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇదే పరిస్ధితి తెలంగాణ ఎన్నికల వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ ఏపీలో అవసరం అనుకుంటే టీడీపీ-జనసేనతో జట్టు కట్టే అవకాశం ఉంటుంది. అప్పటివరకూ తాము కూడా సైలెంట్ గానే ఉంటూ మైండ్ గేమ్ ఆడేందుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications