టీడీపీ-జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్: పెద్ద స్కెచ్చే ఇది
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. టీడీపీకి అండగా నిలవాలని జనసేన నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో.. ఇదివరకు టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ రెండు పార్టీల నేతలు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపొందించుకోవాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టారు.

దీనికి కొనసాగింపుగా నేటి నుంచి టీడీపీ- జనసేన నియోజకవర్గస్థాయిలో సమన్వయ కమిటీలు సమావేశం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 16వ తేదీ వరకు కొనసాగుతాయి. 17వ తేదీ నుంచి ఈ రెండు పార్టీల నాయకులు కూడా నియోజకవర్గ స్థాయిలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి.
నియోజకవర్గ స్థాయిలో మున్ముందు చేపట్టబోయే ఉమ్మడి ప్రచారం కోసం జనసేన ఇన్‌ఛార్జీలను కూడా నియమించింది. మొత్తం 175 స్థానాల్లో ఇన్‌ఛార్జీలను ఏర్పాటుచేసింది. దీనికి సంబంధించిన ఓ జాబితాను జనసేన విడుదల చేసింది. దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా పరిగణిస్తామని తెలిపింది.
ఇదివరకే ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై టీడీపీ-జనసేన కమిటీ మధ్య ఏకాభిప్రాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తంగా 11 అంశాలను చేర్చారు. వాటికి ఈ రెండు పార్టీల అగ్ర నాయకత్వం నుంచి అంగీకారం లభించింది. ఇందులో- బీసీలకు రక్షణ చట్టం, రాజధానిగా అమరావతి కొనసాగింపు, పేదలందరికీ ఉచితంగా ఇసుక సరఫరా.. వంటివి ఉన్నాయి.
సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నియోజకవర్గ సమావేశంలో పార్టీల బలబలాలను అంచనా వేసిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 35 నుంచి 40 సీట్ల వరకు జనసేన డిమాండ్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ, దక్షిణాంధ్ర, కోస్తా, ఉతర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేయాల్సిన నియోజకవర్గాలపై ఓ అవగాహనకు వచ్చారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications