Vijayawada West: విజయవాడ పశ్చిమ సీటులో టీడీపీ-జనసేనకు గండం ?
విజయవాడ సిటీ పరిధిలోకి వచ్చే పశ్చిమ నియోజకవర్గం ఈసారి రాజకీయంగా కాక రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మారిన సమీకరణాలు విపక్ష టీడీపీ-జనసేనను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు బదులుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసిఫ్ కు జగన్ అవకాశం కల్పించారు. దీంతో టీడీపీ-జనసేన పోరు రాజుకుంది.
గతంలో కార్పోరేటర్ గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉన్నఆసిఫ్ ను ఇక్కడ ఇన్ ఛార్జ్ గా ప్రకటించగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా యాక్టివ్ అయ్యారు. అదే సమయంలో టీడీపీలో బీసీ నేత బుద్ధా వెంకన్న కూడా ఈ సీటుపై కన్నేశారు. గతంలో టీడీపీ ఇక్కడ బీసీకి సీటు ఇస్తే తనకు, మైనార్టీకి ఇస్తే నాగుల్ మీరాకు ఇవ్వాలని డిమాండ్లు చేసిన బుద్ధా ఇప్పుడు జలీల్ ఖాన్ కు పోటీగా పావులు కదుపుతున్నారు. ఇంకోవైపు నిన్న మొన్నటివరకూ కేశినేని నాని వెంట ఉండి ఇప్పుడు టీడీపీలోనే ఉండిపోయిన మాజీ మంత్రి బేగ్ కుమారుడు ఎంఎస్ బేగ్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. ఇదంతా టీడీపీ కోణం మాత్రమే.

కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన జనసేన అభ్యర్ది పోతిన మహేష్ ఇక్కడ నాలుగున్నరేళ్లుగా పనిచేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టార్గెట్ గా నాలుగున్నరేళ్లుగా పోతిన మహేష్ తీవ్రంగా పోరాడారు. ఈసారి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటు తనదేనని ఆయన ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా తనకు మాత్రం టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీలో ఈ సీటు కోసం పెరుగుతున్న పోటీ పోతిన మహేష్ లో సైతం ఆందోళన నింపుతోంది.
ఇలా విజయవాడ పశ్చిమ సీటులో టీడీపీ-జనసేన నుంచి ఇప్పుడు అర డజను మంది పోటీ పడుతున్నారు. చంద్రబాబు-పవన్ భేటీ తర్వాత ఈ సీటు టీడీపీ-జనసేనలో ఎవరికి వెళ్తుందన్న దానిపై క్లారిటీ రానుంది. అయితే ఇక్కడ స్ధానిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే వైసీపీ అభ్యర్ధి అయిన ఆసిఫ్ కు పోటీగా టీడీపీ-జనసేన అభ్యర్దిగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను నిలబెడితే గెలిచే అవకాశాలున్నాయి. పోతిన మహేష్ సహా ఇంకెవరైనా అయితే ఆసిఫ్ కు గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. దీంతో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక ఇప్పుడు కత్తీమీద సాముగా మారిపోయింది.












Click it and Unblock the Notifications