ఇరకాటంలో టిడిపి అభ్యర్థి - ఎన్నికల కోడ్ ఉల్లంఘన..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వైసీపీ ఉగాది నాడు తమ మేనిఫెస్టో ప్రకటించనుంది. టిడిపి జనసేన అధినేతలు ప్రజల మధ్యకు రావడానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కురుపాంలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటన ఇప్పుడు ఎన్నికల సంఘం వద్దకు చేరింది.
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందిస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీలో ఉన్నారు. రెండు పార్టీల నుంచి ప్రచార హోరు కొనసాగుతోంది. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా తోయక జగదీశ్వరి చేపట్టిన ఒక కార్యక్రమం పై ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. జగదీశ్వరి భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన స్థానిక ఐటీడీఏ ప్రభుత్వ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన క్వార్టర్స్ లో పార్టీలో చేరిక కార్యక్రమాన్ని జగదీశ్వరి నిర్వహించారు.

స్పష్టమైన మార్గదర్శకాలు
దీనిపైన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘానికి సమాచారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోడ్ అమలుపైన ఎన్నికల సంఘం ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరైనా పోటీలో ఉన్న అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే వారిపైన అనర్హత వేటు వేయటానికి కూడా వెనకాడ వద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. తాజాగా జగదీశ్వరి నీలకంఠాపురం పంచాయతీ మామిడి మానుగూడ, సాలిడంగూడకు చెందిన కొన్ని కుటుంబాలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమం తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేటాయించిన ప్రభుత్వ క్వార్టర్స్ లో నిర్వహించడం పైన స్థానికంగా ఫిర్యాదులు వచ్చాయి.

ఉన్నతాధికారులకు నివేదిక
దీంతో ఈ వ్యవహారం పైన ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు నివేదించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికల సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు కూడా ఆధారాలుగా అందించినట్లు సమాచారం. దీనిపైన పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఉన్నతాధికారులు స్పందించే అవకాశం కనిపిస్తోంది. కోడ్ ఉల్లంఘన విషయంలో ఇప్పటికే ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. కురుపాం టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదుల వేల ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది స్థానికంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications