టీటీడీలో మరో వికెట్: టీడీపీ నేత రాజీనామా!
తిరుపతి: తెలుగుదేశం ప్రభుత్వం తన హయాంలో నియమించిన నామినేటెడ్ పదవులు ఒక్కటొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. తాజాగా- తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు సుగవాసి ప్రసాద్‌బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఈ రాజీనామాను ఆయన వెంటనే ఆమోదించారు. గత ప్రభుత్వం తమకు ఈ పదవి ఇచ్చిందని, ఇంతవరకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
సుగవాసి ప్రసాద్‌బాబు కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత. పార్టీ సీనియర్ నేత పాలకొండ్రాయుడు కుమారుడు ఆయన. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన రాయచోటి నుంచి పోటీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ రెడ్డిని పోటీకి దింపారు.

దీనిపై ఆయన అలకపాన్పు ఎక్కడంతో టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం కల్పించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అన్ని దేవస్థానాల పాలక మండళ్లను రద్దు చేస్తుందన్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications