ఏపీ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటీషన్: నిర్భయ కేసుపై సవాల్: అధికారిణిపై బూతులతో
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై, పోలీసులు నమోదు చేసిన కేసులపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ హైకోర్టును ఆశ్రయించే ప్రక్రియ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా- టీడీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ పొలిట్‌బ్యురో సభ్యుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు పోలీసులు నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ పిటీషన్‌ను దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై బూతులతో విరుచుకుని పడిన కేసులో ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంన విషయం తెలిసిందే. కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బహిరంగ సభలో అందరి ముందూ తనను కించపరిచేలా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు. అయ్యన్న పాత్రుడి తాత లచ్చా పాత్రుడి నిలువెత్తు ఫొటోను మున్సిపల్ కౌన్సిల్ హాలు నుంచి తొలగించి, దాన్ని కమిషనర్ ఛాంబర్‌లో అమర్చారు.

అది కాస్తా అయ్యన్న పాత్రుడికి ఆగ్రహాన్ని తెప్పించింది. తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిల్ హాలులో ఉన్న ఫొటోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందంటూ ఆయన మండిపడ్డారు. మైక్‌లో అందరి ముందూ కృష్ణవేణిని అవమానించేలా మాట్లాడారు. బట్టలు ఊడదీయాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారని నిలదీశారు. కృష్ణవేణి స్థానంలో మరో అధికారి ఉంటే తాను బట్టలు ఊడదీసే వాడినని అన్నారు. తాను న్యాయంగా ఉన్నాను కాబట్టే ఆ పని చేయట్లేదని చెప్పారు.
కౌన్సిల్ హాల్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని, అందుకే తాత్కాలికంగా ఫొటోను వేరే ప్రదేశానికి మార్చాల్సి వచ్చిందని కృష్ణవేణి వివరణ ఇస్తున్నప్పటికీ..అయ్యన్నపాత్రుడు వినిపించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల గణేష్ కుమార్‌కు తొత్తుగా మారారని ఆరోపించారు. తాను మాజీమంత్రిని అనే విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి అయ్యన్నపాత్రుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు అక్రమమని అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. తాను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదని చెబుతున్నారు. అధికార పార్టీ తనపై కక్ష కట్టిందని, పగ తీర్చుకోవడంలో భాగంగా తనపై అక్రమంగా నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రేపో, మాపో ఇది విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications