చంద్రబాబును కలిసిన భూమా అఖిలప్రియ దంపతులు: తమ్ముడితో కలిసి భేటీ
అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతులు.. పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని కలిశారు. సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వారి వెంట ఉన్నారు. ఇది మర్యాదపూరక భేటీ. కిందటి నెల భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చారు. చంద్రబాబు ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో అఖిలప్రియ దంపతులు ఆయనను కలిశారు.
భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డితో కలిసి భూమా అఖిలప్రియ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించారు. అఖిలప్రియ కుమారుడిని ఎత్తుకుని ముద్దాడారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకు పైగా భూమా దంపతులు చంద్రబాబు నివాసంలో ఉన్నారు. చంద్రబాబు వారితో సరదాగా గడిపారు. చిన్నారిని ఎత్తుకుని, ఆశీర్వదించారు.

అఖిలప్రియ కిందటి నెల 16వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భార్గవ్‌రామ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అఖిలప్రియకు ఇదే తొలి కాన్పు కావడం వల్ల ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి మళ్లీ పుట్టాడంటూ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నంద్యాల శాసనసభ్యుడిగా ఉన్న భూమా నాగిరెడ్డి.. గుండెపోటుతో కన్నుమూశారు.
అఖిలప్రియ భార్గవ్‌రామ్‌ను పెళ్లి చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, అఖిలప్రియ మంత్రి పదవిని కోల్పోయిన తరువాత కొన్ని అనూహ్య ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె మీద కిడ్నాప్ కేసు నమోదైంది. భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తరువాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదం కేసు అఖిలప్రియను ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు.

వ్యతిరేక పరిస్థితుల్లో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆమెకు అండగా ఉంటూ వచ్చింది. అఖిలప్రియ అరెస్టయిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె వెంటే నిలిచారు. ఆమె సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు అఖిలప్రియకు బాసటగా ఉన్నారు. ఇక కుమారుడి రాకతో అఖిలప్రియ కుటుంబం, ఆమె అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications