నంద్యాల ప్రచారంలో ఉండగా.. ఆ టీడీపీ నేతకు విషాద వార్త!, బోరున ఏడుస్తూ..(ఫోటోలు)
తమ్ముడి విషాద వార్త తెలిసిన సందర్భంలో వీరభద్రగౌడ్ నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో ఉన్నారు.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ విషాద వార్త వినాల్సి వచ్చింది. వీరభద్రగౌడ్ తమ్ముడు కుమార్‌గౌడ్ (48)రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
పెద్దతుంబళం గ్రామ సమీపంలో కోసిగి గ్రామ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ రాజును స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

షాపూర్ వెళ్లి వస్తుండగా..
ఆదివారం ఉదయం షాపూర్ వెళ్లిన కుమార్ గౌడ్.. తిరుగు ప్రయాణంలో కోసిగి వద్ద ప్రమాదానికి గురయ్యారు. స్కార్పియో కారు వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా డోర్లు తెరుచుకోవడంతో డ్రైవర్, కుమార్ గౌడ్ ఇద్దరూ చెరో పక్క ఎగిరిపడ్డారు. దీంతో కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు.

కీలక బాధ్యతల్లో:
అపెక్స్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఎల్లెల్సీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గానూ, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్‌గా కుమార్ గౌడ్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆదోనికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముద్దుబసవన్నగౌడ్, సావిత్రమ్మ దంపతులకు ఈయన చిన్న కుమారుడు.

ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకునేలోపే:
వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకునేలోపే ప్రమాదం జరిగిపోయిందని ఎస్‌ఐ హుసేన్ బాషా తెలిపారు. డోర్లు తెరుచుకుని వారు ఎగిరిపడటం వల్లే ప్రమాదం సంభవించిందని, కారులోనే ఉండి ఉంటే ప్రాణ నష్టం జరగకపోయేదని పేర్కొన్నారు. మృతుడికి భార్య రేవతి, కుమారులు మంజునాథ్‌గౌడ్, మల్లికార్జునగౌడ్ ఉన్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

నంద్యాల ప్రచారంలో అన్న, బోరున ఏడుస్తూ..:
ప్రమాద ఘటన తర్వాత ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఫోన్ ద్వారా వీరభద్రగౌడ్ కి విషయాన్ని తెలియజేశారు. అప్పటికి నంద్యాల ప్రచారంలో ఉన్న ఆయన తమ్ముడి మరణ వార్త కంటతడి పెట్టుకున్నారు. హుటాహుటిన ఆదోనికి చేరుకున్న ఆయన సోదరుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.












Click it and Unblock the Notifications