చంద్రబాబుకు షాక్, వైసీపీలోకి గుంటూరు జిల్లా టీడీపీ నేత!: త్వరలో జగన్ సమక్షంలో
గుంటూరు: అధికార తెలుగుదేశం పార్టీకి షాక్. గుంటూరు జిల్లా టీడీపీ నేత నిమ్మకాయల రాజనారాయణ ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన 2009లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీన ఆయన పాదయాత్ర సత్తెనపల్లిలో ఉంటుంది. ఆ సమయంలోనే జగన్ సమక్షంలో రాజనారాయణ వైసీపీలో చేరనున్నారు.

వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడితో చర్చలు
వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు గుబ్బా చంద్రశేఖర్.. రాజనారాయణతో శనివారం చర్చలు జరిపారు. జగన్ సమక్షంలో తాను వైసీపీలో చేరుతున్నట్లు ఆయన కూడా మీడియాకు తెలిపారు. ఆయన గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

రాజనారాయణతో పాటు మరికొందరు
రాజనారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ఆతుకూరి నాగేశ్వర రావులు శనివారం సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజనారాయణను తెలగ సంఘం నేత ఆకుల శివయ్య తదితరులు సన్మానించారు.

ఢిల్లీలో తాకట్టు పెట్టమన్నారా
ప్రత్యేక హోదాను ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టమని చంద్రబాబుకు ఏ ప్రజలు చెప్పారని, హోదాకు బదులు ప్యాకేజీ తీసుకోమని ప్రజలు మీకు చెప్పారా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అమ్మేయమని చెప్పారా అని జగన్ ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనమని, ఆడియో వీడియో టేపులతో దొరికిపొమ్మని ప్రజలు చెప్పారా అని నిలదీసారు.

జగన్ ప్రజా సంకల్ప యాత్ర
జగన్ ప్రజా సంకల్ప యాత్ర నరసారావుపేటలో శనివారం కొనసాగింది. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో చోటు చేసుకున్న అవినతిని తూర్పారబట్టారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సాగిస్తున్న నాటకాలను ఆయన ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. చేయాల్సిందంతా చేసి ప్రజల కోసమే చేశానని చెప్పడం దారుణమన్నారు.












Click it and Unblock the Notifications