టికెట్ ఇస్తానని రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు: టీడీపీలో మరో బిగ్ వికెట్ అవుట్
Muddaraboina Venkateswara Rao: తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని వీడుతున్న సీనియర్ నాయకుల జాబితాలో మరో పేరు చేరింది. ఇప్పటికే బిగ్ షాట్స్ విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, కేశినేని శ్వేత, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగండ్ల స్వామిదాస్.. ఇలా టీడీపీకి గుడ్‌బై చెప్పారు.
తాజాగా ఎన్టీఆర్ జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, నూజివీడు ఇన్‌ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జి బాధ్యతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి అప్పగిస్తున్నట్లు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

పార్థసారథిని నూజివీడు ఇన్‌ఛార్జిగా నియమించడాన్ని ముద్దరబోయిన తప్పుపట్టారు. 2014 నాటికి నియోజకవర్గంలో ఛిన్నాభిన్నమైన పార్టీని బలోపేతం చేయడానికి తాను ఎంతో కష్టపడుతున్నానని, ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేయబోరనే నమ్మకంతో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గానికి పార్టీ కార్యాలయం కట్టించడం మొదలుకుని.. అన్ని కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహించానని ఆయన గుర్తు చేశారు. 2024 ఎన్నికల కోసం తాను సిద్ధపడుతున్నానని, ప్రచారంలో పాల్గొంటోన్నానని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి తెచ్చుకున్న నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని అన్నారు.
నూజివీడు టికెట్ తనదేనంటూ చంద్రబాబు రెండుసార్లు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు అనివార్య కారణాలు అనే పేరుతో తనను తప్పించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దీనికి నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేస్తోన్నానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకూ పార్టీ కండువాను కప్పుకోని వైసీపీ నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.
టికెట్ తనదేననే నమ్మకంతో ఎంతో ఖర్చు పెట్టుకున్నానని ముద్దరబోయిన ఆవేదనతో చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది త్వరలోనే తెలియజేస్తానని అన్నారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.












Click it and Unblock the Notifications