మంగళగిరిలో లోకేష్ బిగ్ స్కెచ్ ! తటస్ధులపై ఫోకస్ ! కలిసొస్తున్న వైసీపీ వర్గపోరు ?

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన అప్పటి సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తలపడ్డారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైసీపీ గాలి, అమరావతే రాజధానిగా ఉంటుందంటూ జగన్ ఇచ్చిన హామీ పనిచేసి లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం పరిస్ధితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది.

మంగళగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ కోల్పోయారు. దీంతో ఆయన్ను మార్చి స్ధానిక చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవిగా పోరు మారిపోయింది. లోకేష్ తో పోలిస్తే గంజి చిరంజీవికి అంత అంగ బలం, అర్ధబలం లేకపోయినా స్ధానిక బీసీ ఓట్లను నమ్ముకుని ఆయన బరిలోకి దిగుతున్నారు.

tdp leader nara lokesh big sketch on mangalagiri consitituency, focus on neutral voting

ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఈసారి తన గెలుపు తధ్యమని నారా లోకేష్ అంచనా వేసుకుంటున్నారు. దీంతో తాజాగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్.. 11 నెలల తర్వాత తొలిసారి మంగళగిరికి వచ్చారు. గతానికి భిన్నంగా ఈసారి తటస్ధ ఓటరు ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఆత్మకూరులో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంగళగిరి పట్టణంలో అతిపెద్ద మాస్టర్ వీవర్ అయిన జొన్నాదుల వరప్రసాద్ ను కలిశారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

అనంతరం పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పద్మశాలీయుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్న కనకయ్య పలు సమస్యలను ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పద్మశాలీయులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానని, మరో 3నెలల్లో టీడీపీ ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తర్వాత ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్, కుటుంబసభ్యుల్ని లోకేష్ కలిశారు. ఇవాళ తాడేపల్లిలో టీడీపీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేసి పార్టీ నేతలతో లోకేష్ భేటీ అవుతారు.

అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంపై రాజధాని మార్పు ప్రభావం ఎలాగో ఉంది. అదే సమయంలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, వైసీపీలో వర్గపోరు నెలకొంది. వైసీపీలో ఇన్ ఛార్జ్ మార్పు తర్వాత ఆర్కే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాగే గంజి చిరంజీవితో టికెట్ కోసం పోటీపడుతున్న కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు వర్గం కూడా ఆయనకు సహకరించే పరిస్దితులు కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ లోకేష్ లో గెలుపు ఆశలు పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+