వైజాగ్ ఎయిర్‌పోర్ట్ జగన్ రెడ్డికి లక్కీ ప్లేస్: ఆయనే బాధ్యుడు: వైసీపీని తరిమికొట్టండి: పట్టాభి
అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రవైేటీకరణ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలను సంధిస్తోంది.. ఆరోపణలను గుప్పిస్తోంది. మొన్నటిదాకా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోగా.. ఆ పార్టీ నేతలు దాన్ని కొనసాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గానీ, నరేంద్ర మోడీని గానీ విమర్శించే ప్రయత్నాలు చేయట్లేదు.
జగన్ విసిరే బిస్కెట్ల కోసం కక్కుర్తి పడుతోన్న బాడుగ నేతలు: ఉద్యోగ సంఘాల నేతలపై పట్టాభి ఫైర్

ఎయిర్ పోర్టు బాగా కలిసొచ్చినట్టుంది..
తాజాగా- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్.. వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా జగన్ విమానాశ్రయంలో కార్మిక సంఘాల నేతలతో భేటీ కావడాన్ని తప్పు పట్టారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ జగన్‌కు బాగా అచ్చి వచ్చినట్టు కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఎయిర్ పోర్టులో పంచాయితీలను నిర్వహిస్తోన్నారంటూ చురకలు అంటించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవైటీకరించడానికే జగన్ మొగ్గు చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కారణంతోనే ఆయన పోస్కో కంపెనీ ప్రతినిధులను అదే పనిగా పిలిపించుకున్నారని ఆరోపించారు.

కోడికత్తి పంచాయితీ సహా..
ఇదివరకు కోడికత్తి పంచాయితీని జగన్ అక్కడే పెట్టారని, ఎల్జీ పాలిమర్స్ బాధితులు, కంపెనీ ప్రతినిధులను కూడా ఎయిర్‌పోర్ట్‌కే పిలిపించుకుని సెటిల్‌మెంట్లు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పంచాయితీని అక్కడే సెటిల్ చేస్తున్నారని విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణంగా గత ఏడాది మాత్రమే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కొద్దిగా నష్టాలు వచ్చాయని, దాన్ని సాకుగా చూపించి వైఎస్ జగనే కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చి మరీ దీన్ని అమ్మకానికి పెట్టించారని పట్టాభి ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలను తరిమి కొట్టండి
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టించిన వైఎస్సార్సీపీ నేతలను ఎవరూ నమ్మొద్దని ఆయన కార్మిక సంఘాల నేతలకు సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ వేదికలపై నుంచి వైసీపీ నేతలను తరిమి కొట్టాలని అన్నారు. పరిరక్షణ ఉద్యమానికి వారు వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఆడే డ్రామాలు, కుట్రలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన ఏడువేల ఎకరాలపై వైసీపీ నేతలు కన్నేశారని ఆరోపించారు.

కొంటామని ఎందుకు చెప్పరు..
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్లాంట్‌ను అమ్మకానికి ఉంచితే.. తాము దాన్ని కొంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ జగన్ ఎందుకు ప్రకటించట్లేదని పట్టాభి నిలదీశారు. ఎవరో ఒకరిద్దరు నాయకులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆ ప్రకటన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం ద్వారా వచ్చే లబ్దిని తాను పొందడానికే జగన్ కేంద్రాన్ని ప్రోత్సహిస్తోన్నారని ఆయన అన్నారు. ఇలాంటి కుట్రలను తాము అడ్డుకుని తీరుతామని, ప్రైవేటు పరం కానివ్వకుండా నిలువరించే శక్తి సామర్థ్యాలు తమ పార్టీకే ఉన్నాయని చెప్పారు.