హెల్త్ ఎమర్జెన్సీ పక్కన పెట్టి, అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్ ప్రోకో : టీడీపీ నేత పట్టాభి ధ్వజం
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇదే సమయంలో ఏపీలో అమూల్ డెయిరీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి ఈ రోజు క్యాబినెట్ భేటీలో అమూల్ డెయిరీపై చర్చ జరిగిందని ,పట్టాభి అమూల్ అతిపెద్ద డెయిరీ స్కామ్ అంటూ విమర్శలు గుప్పించారు.

హెల్త్ ఎమర్జెన్సీని పక్కన పెట్టి అమూల్ సంస్థ పై చర్చించడం ఏమిటి ?
ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ పై మాట్లాడిన పట్టాభి కేబినెట్ అజెండాలో తొలి అంశంగా ఉండాల్సిన కరోనా చివరి అంశంగా ఉండటం అత్యంత బాధాకరమని అభిప్రాయపడ్డారు.దీన్నిబట్టే సీఎం జగన్ కు ప్రజల ప్రాణాలతో ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతోందని విమర్శించారు.ఇదే సమయంలో ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు కట్టబెట్టడంపై మండిపడ్డారు.హెల్త్ ఎమర్జెన్సీని పక్కన పెట్టి అమూల్ సంస్థ పై చర్చించడం ఏమిటని ప్రశ్నించారు పట్టాభి.

పాడి రైతులకు మేలు చేస్తానని చెబుతూ,సీఎం క్విడ్ ప్రోకో
ఆంధ్రప్రదేశ్లో అమూల్ అనేది అతిపెద్ద డెయిరీ స్కామ్ అని పేర్కొన్న పట్టాభి అమూల్ ముసుగులో పాడి రైతులకు మేలు చేస్తానని చెబుతూ,సీఎం క్విడ్ ప్రోకోకు తెర తీశారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో మిల్క్ చిల్లింగ్ కు లీటర్ కు 50 పైసలు, ప్రాసెసింగ్ కు లీటరుకు రెండు రూపాయలను అమూల్ సంస్థ చెల్లిస్తుందని పేర్కొన్న పట్టాభి, ఏపీలో మాత్రం మిల్క్ చిల్లింగ్ కు ఐదు పైసలు,ప్రాసెసింగ్ కు లీటరుకు 12 పైసలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఏపీలో కరోనా పంజా .. ప్రభుత్వ పట్టింపు ఏదీ ?
ఏపీలో కరోనా విజృంభిస్తున్నా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిడిపి నేత పట్టాభి ఆరోపించారు. అధికారిక లెక్కల కు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నా సీఎం జగన్ కు అవి పట్టడం లేదన్నారు. ఆస్పత్రిలో బెడ్ల కొరత , ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా బారిన పడి ప్రజలు చనిపోతున్నా క్యాబినెట్ భేటీలో సైతం ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications