Raghurama: ఉండిలో రఘురామపై బెట్టింగ్ ఇలా..! స్వయంగా బయటపెట్టిన వైనం..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈలోపే ఫలితాలపై పలు చోట్ల బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికలు ఓవైపు, భారీగా నమోదైన పోలింగ్ శాతాలు మరోవైపు రాజకీయ నేతల్ని టెన్షన్ లోకి నెడుతుంటే.. బెట్టింగ్ రాయుళ్లు మాత్రం క్షేత్రస్దాయిలో తమకున్న సమాచారంతో బెట్టింగ్ లు వేసేస్తున్నారు. ఇదే క్రమంలో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన రఘురామకృష్ణంరాజు గెలుపుపైనా బెట్టింగ్ జరుగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నుంచి టీడీపీ అభ్యర్ధిగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని పోటీ చేసిన రఘురామకృష్ణంరాజుకు రెబెల్ అభ్యర్ధి శివరామరాజు కలవపూడి శివ)తో పాటు వైసీపీ అభ్యర్ధి పీవీ నరసింహరాజు నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే దీన్ని అధిగమించి రఘురామ గెలుస్తున్నారా లేదా అనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. దీంతో ఉండిలో రఘురామ గెలుపుపై వైసీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు ఓ రేంజ్ లో పందాలు కాసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామ స్వయంగా తన గెలుపుపై సాగుతున్న బెట్టింగులపై నోరు విప్పారు. భీమవరంలో బెట్టింగ్ రాయుళ్లతో తనకు సంబంధాలున్నాయని, కానీ ఎప్పుడూ తాను బెట్టింగ్ చేయనన్నారు. తనకు అందిన సమాచారం మేరకు తనకు 18 వేలు మెజార్టీ వస్తుందని, రాదని పందాలు కాసుకుంటున్నారని రఘురామ తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ విషయం చూశానన్నారు. దీంతో తన గెలుపు ఖాయమని చెప్పేశారు.
భీమవరంలో అయితే 25 వేల మెజార్టీ అని పందాలు కాస్తున్నట్లు రఘురామ తెలిపారు. ఉండిలో తనకు 30 వేలకు పైగానే మెజార్టీ వస్తుందన్నారు. జగన్ విచిత్ర ప్రయోగం వల్ల ఓ 10 వేలుతగ్గినా 30 వేలైతే ఖాయమన్నారు. చంద్రబాబు, పవన్ కు వచ్చినట్లు 50 వేలు రాకపోయినా ఇది ఖాయమని రఘురామ వెల్లడించారు. ఉండికి చివరి నిమిషంలో వెళ్లినా, జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా గెలువబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications