టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేరనున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?
అమరావతిః ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనే- రఘురామ కృష్ణంరాజు.
ఇదివరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ కన్వీనర్ గా పనిచేశారు. కొద్దిరోజుల కిందటే నరసాపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో తన అనుచరులతో వరుస సమావేశాలను నిర్వహించారు. వారి సూచన మేరకు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రఘురామ కృష్ణంరాజు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావుకు వియ్యంకుడు.

పార్టీలో చేరిన వెంటనే.. ఆయనకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ చేతిలో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ.. ఈ స్థానాన్ని కమలనాథులకు కేటాయించింది.
బీజేపీ తరఫున గోకరాజు గంగరాజు పోటీ చేసి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్ పై 80 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగా నరసాపురం నుంచి లోక్ సభకు పోటీ చేయనుంది. అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నరసాపురం నుంచి లోక్ సభకు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును బరిలో దింపవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications