రాజకీయ బద్ధశతృవుకు జగన్ స్నేహ హస్తం
Satish Reddy: ఊహించినట్టే- కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు.. సతీష్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయంగా అజ్ఞాతంలో గడిపారు. ఈ దశలో వైఎస్ఆర్సీపీకి చెందిన కడప జిల్లా సీనియర్ నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపారు.

మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సురేష్ బాబు మరికొందరు నాయకులు ఇటీవలే కడప జిల్లా వేంపల్లిలో సతీష్ రెడ్డిని కలిశారు. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, వారి సూచనలు, సలహాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానంటూ బదులిచ్చారు.
దీనికి అనుగుణంగా సతీష్ రెడ్డి ఇటీవలే తన అనుచరులతో సమావేశం అయ్యారు. వైసీపీలో చేరుతానంటూ ప్రకటించారు. తాను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి 2020 వరకు తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేశానని, టీడీపీని తన కుటుంబంగా భావించానని, అయినప్పటికీ- ఈ నాలుగేళ్లల్లో తనను ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు.
తాను నమ్మిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్.. అవమానించారని విమర్శించారు. వైఎస్ కుటుంబంతో లాలూచి పడ్డాననే నిందారోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతగా అవమానించిన తరువాత టీడీపీలో ఉండటం సరికాదని ఆ రోజే రాజీనామా చేశానని సతీష్ రెడ్డి వివరించారు.
ఈ క్రమంలో సతీష్ రెడ్డి తన అనుచరులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. ఆయన చేతుల మీదుగా వైసీపీ కండువాను కప్పుకొన్నారు.
రాజకీయంగా పులివెందులలో వైఎస్ కుటుంబానికి బద్ధశతృవుగా కొనసాగారు సతీష్ రెడ్డి. 2004 నుంచి ప్రతి ఎన్నికలోనూ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొంటూనే వచ్చారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసే నాయకుడు ఆయన ఒక్కరే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌పైనా పోటీ పడ్డారు గానీ ఓడిపోతూ వచ్చారు.












Click it and Unblock the Notifications