ట్రంప్ ఇలా.. జగన్ అలా.. టీడీపీ నేత సోమిరెడ్డి పోలిక..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నిన్న జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతున్న క్రమంలో జరిగిన ఈ దాడితో ఈ ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖాయమైపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. తాజా సర్వేల్లోనూ ఈ విషయం వెల్లడైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై జరిగిన గులకరాయి దాడి తెరపైకి వచ్చింది.
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో యాత్ర నిర్వహిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ పై గులకరాయి దాడి జరిగింది. దీంతో జగన్ నుదుటిపై గాయమైంది. అయితే ఈ గాయం తర్వాత వెంటనే వాహనం దిగి వెళ్లిపోయిన జగన్ ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు చూసినా జనం మాత్రం పట్టించుకోలేదని ఆ తర్వాత వెలువడిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ క్రమంలో తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ట్రంప్ దాడితో జగన్ దాడిని ముడిపెడుతూ సెటైర్లు వేస్తున్నారు.

బుల్లెట్ తగిలితే పౌరుష సింహనాదం - నాయకత్వ లక్షణం,
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) July 15, 2024
గులక రాయికే ప్రాణభయం - పిరికిపంద తత్వం. pic.twitter.com/8Osgk1ifXS
జగన్ పై సమయం దొరికినప్పుడల్లా సెటైర్లు వేసే టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో దాడులకు గురైన ట్రంప్, వైఎస్ జగన్ ఫొటోలను పెట్టారు. అలాగే వీరిద్దరి దాడి, అనంతరం వీరు స్పందించిన తీరును గుర్తుచేసేలా బుల్లెట్, గులకరాయి పేర్లు పెట్టి కామెంట్స్ చేశారు. బుల్లెట్ తగిలితే పౌరుష సింహనాదం - నాయకత్వ లక్షణం, గులక రాయికే ప్రాణభయం - పిరికిపంద తత్వం. అంటూ జగన్ ను ఏకేశారు. దీంతో ఇప్పుడు సోమిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications