టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత వరుపుల రాజా (47) శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొని, శనివారం సాయంత్రం స్వగ్రామం ప్రత్తిపాడుకు వచ్చారు. రాత్రి 8.30 గంటల వరకు పార్టీ శ్రేణులు, బంధువులతో మాట్లాడారు. అనంతరం తీవ్ర గుండెపోటు రావడంతో ఈసీజీ తీయించారు. దాన్ని విశాఖపట్నంలోని ప్రముఖ వైద్యునికి వాట్సాప్ చేశారు. ఆయన తక్షణమే కాకినాడకు తరలించాలని సూచించారు.

కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలింపు
దీంతో రాజాను కారులో ఎక్కించి కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన రాత్రి 10.00 గంటలవేళ అపోలో ఆసుపత్రికి రాజాను తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన రాజా స్వయంగా కారు దిగి గుండెపై చేయి వేసుకుని నొప్పితో ఆసుపత్రిలోకి వెళ్లారు.
లోపలికి వచ్చిన వెంటనే రాజా కుప్పకూలిపోయారు. సీపీఆర్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది. రాత్రి 11.00 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అనంతతరం అర్థరాత్రి 12:10 గంటలకు రాజా భౌతికకాయాన్ని ప్రత్తిపాడుకు తరలించారు. రాజా అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు.
కాకినాడలో ఆసుపత్రి వద్ద రాజా భౌతికాయానికి టీడీపీ నేతలు కొండబాబు, జ్యోతుల నవీన్, మాజీ మేయర్ పావని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు నివాళులర్పించారు

5 సంవత్సరాల క్రితం స్టంట్ అమర్చారు
ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజా.. డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. చురుకైన నేతగా పేరు తెచ్చుకున్న రాజా హఠాన్మరణంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
వరుపుల రాజాకు 5 సంవత్సరాల క్రితం గుండెపోటు రాగా స్టంట్ అమర్చారు. భార్య సత్యప్రభ, కుమార్తె సత్యమాధురి, కుమారుడు సాయి తర్షిత్ ఉన్నారు. వరుపుల రాజా అసలుపేరు వరుపుల జోగిరాజు. వరుపుల తమ్మారావు, సత్యవతి దంపతుల కుమారుడే రాజా.

మొదటి నుంచి రాజకీయ కుటుంబమే
మొదటి నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన రాజా తాత వరుపుల జోగిరాజు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజా తండ్రి వరుపుల తమ్మారావు పెదశంకర్లపూడిలో పలు పదవులు చేపట్టారు. రాజా కూడా అదే బాటలో పెదశంకర్లపూడి ఎంపీటీసీగా విజయం సాధించారు. తర్వాత ప్రత్తిపాడు ఎంపీపీగా పనిచేశారు. లంపకలోవ సొసైటీ అధ్యక్షుడిగా గెలుపొంది జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆప్కాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వల్పతేడాతో ఓటమిపాలయ్యారు. ఆయన మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. రాజా కుటుంబానికి అండగా ఉంటానన్నారు. ఈరోజు చంద్రబాబు రాజా భౌతిక కాయానికి నివాళులర్పించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications