కోడెల చావు వెనుక విజయసాయిరెడ్డి ? పల్నాడులో ఫిర్యాదు..!
వైసీపీలో ఒకప్పుడు అంతా తానై చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినా గత తప్పిదాలు మాత్రం ఆయన్ను వీడటం లేదు. ఇప్పటికే కాకినాడ పోర్టు వాటాల బదిలీ సహా పలు కేసుల్లో ఆయన పాత్రపై ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఇప్పుడు పల్నాడులో సాయిరెడ్డితో పాటు నరసరాపుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపైనా ఇవాళ ఓ కేసు దాఖలైంది. దీంతో సాయిరెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు.
పల్నాడు ప్రాంతానికి చెందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. దీని వెనుక విజయసాయిరెడ్డితో పాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు నరసరావుపేట పోలీసు స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని వీరిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

వీరు పెట్టించిన తప్పుడు కేసుల వల్ల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో టీడీపీ నేతలు ఆరోపించారు. 2019లో కోడెలకు లంచం ఇచ్చినట్లు వీరు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుతో తప్పుడు కేసు పెట్టించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో ఈ ముగ్గురిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా నాగరాజు తాను కోడెల తండ్రీ కొడుకులపై తప్పుడు ఫిర్యాదు చేశానంటూ గతంలో పెట్టిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వీరిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పల్నాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications