గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎందుకంత ప్రత్యేకత?: టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఆత్మకూరు అసైన్డ్ భూములు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే చివరి పంక్తిలో కుర్చున్నా అన్నీ దక్కుతాయన్న సామెత ఆధారంగా టీడీపీ ప్రభుత్వం అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల భూములపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తమ వారి కోసం, పార్టీ కోసం అసైన్డ్ భూములను చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసింది అమరావతి నగర ప్రతిపాదిత గ్రామాల్లో వాగులు, డొంక పోరంబోకు భూములు సుమారు 8 వేల ఎకరాల వరకు ఉన్నాయి.

రాజధాని నిర్మాణంలో భాగంగా వీటిని వౌలిక సదుపాయాలు, పార్కులకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తన పార్టీ అధికారిక కార్యక్రమాలను గుంటూరు నుంచి కొనసాగిస్తోంది. ఇటీవలే ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లా ప్రార్టీ కార్యాలయాన్ని సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. సుమారు రెండువేల చదరపు గజాల పైచిలుకు నగరపాలక సంస్థ స్థలంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన అనంతరం లీజుకు తీసుకోగా ఆ తర్వాత నగరపాలక సంస్థ ఆమోదంతో లీజు గడువును పొడిగించారు.

గుంటూరు జిల్లా కార్పోరేషన్‌కు సంబంధించిన ఈ స్థలాన్ని కారు చౌకగా లీజుకు తీసుకుని ఎన్టీఆర్ భవన్ పేరిట భవంతిని నిర్మించారు. అయితే ఇప్పుడు అమరావతిలో రాజధాని నిర్మితమవుతున్న సందర్భంలో శాశ్వతంగా టీపీడీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆత్మకూరు గ్రామంలో నిర్మించేందుకు అనువైన స్థలం కోసం పరిశీలన జరిపారు.

Tdp leaders taking assigned lands in amaravathi

ఇందులో భాగంగా మంగళగిరి రూరల్ మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో వాగు పోరంబోకు స్థలం 3.78 ఎకరాలను స్వాధీనం చేయాల్సిందిగా తహశీల్దారుకు ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు దరఖాస్తు సమర్పించారు.

సాధారణంగా ఓ మనిషి అసైన్డ్ ల్యాండ్‌కు సంబంధించి భూ కేటాయింపులు జరపాలంటే నెలలు కాదు కదా ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. అయితే అధికార పార్టీ కార్యాలయానికి అందిన దరఖాస్తు కనుక అదేరోజున మంగళగిరి తహశీల్దారు కార్యాలయం నుంచి గుంటూరు ఆర్డీవోకు చేరింది.

ప్రస్తుతం గుంటూరు జిల్లా అధికారులు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉండటంతో మంగళవారం ఫైలును పరిశీలించి తగిన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇంకేముంది దీనిని ఏపీ కేబినెట్‌లో ఆమోదించడమే తరువాయి. నిబంధనల ప్రకారం ఈ వాగులకు సంబంధించిన భూ లావాదేవీలు నిషేధం.

అయితే నిబంధనలకు తిలోదకాలిచ్చి రెవెన్యూ అధికారులు స్వామిభక్తిని చాటుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ భూమిని గత 45 సంవత్సరాలుగా తాము అనుభవిస్తున్నట్లు గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, రఘురామారావు గుంటూరు జిల్లా కలెక్టర్ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాగా ఈ సర్వే నెంబరుగల వాగు భూమికి మధ్యలో కాల్వ ఉంది. దీన్ని కూడా కలిపి తెలుగుదేశం కార్యాలయానికి కేటాయించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆత్మకూరు గ్రామం విషయానికి వస్తే 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలోనే ఉంది.

అంతేకాదు గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ నగరాలకు అతి సమీపంలో ఉంది. రాజధాని అమరావతికి కూడా అందుబాటులో ఉన్న ఈ గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే అటు పార్టీ కార్యక్రమాలు.. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు సులభతరం అవుతాయనే భావనతో ఈ భూమిని ఎంచుకున్నట్లు తెలిసింది.

ఇటీవల ఏపీ మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని విజయనగరం, కాకినాడలో ఎన్టీఆర్ ట్రస్టుకు భూములు ధారాదత్తం చేస్తూ గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో బీజేపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తుంటే ఆత్మకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భూమిని కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. అంతేకాదు ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంతేకాదు రాజధానికి ఔటర్, ఇన్నర్ రింగురోడ్ల నిర్మాణాలు పూర్తయితే ఈ భూముల విలువ మరితంగా పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అసైన్డ్ భూములను సమీకరించడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.

English summary
Tdp leaders taking assigned lands in amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X