రేపల్లె గరంగరం: టీడీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్: ఆ వార్తలతో కలకలం: జిల్లా ఎస్పీ ఆదేశించినా
బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గం పరిధిలోని పోటమెరకలో మద్యం మరణాలు సంభవించాయనే వార్తలు కలకలం రేపాయి. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. గృహనిర్బంధంలో ఉంచారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు.
పోటు మెరకలో ఘటన..
పోటుమెరకలో గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య అనే ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి మరణించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాప్‌లో వారు మద్యం కొని సేవించిన కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అనంతరం మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ సమీప బంధువు ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, భోజనం చేయడానికి ముందు మద్యం సేవించారని అంటున్నారు.

మోపిదేవి పరామర్శ..
మద్యం తాగిన తరువాత నలుగురు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా ఇద్దరు కోలుకున్నారు. నాంచారయ్య, రత్తయ్య మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహార నమూనాలను సేకరించారు. మద్యం ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనేది ఆరా తీశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
నిజ నిర్ధారణ కమిటీ
ఈ ఉదయం అనగాని సత్యప్రసాద్ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో పోటు మెరకకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ఉదయం తన ఇంటికి వచ్చిన పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి అయిదు కార్లల్లో సంఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు కల్తీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తోన్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

ఎస్పీ ఏం చెప్పారు..?
నాంచారయ్య, రత్తయ్య మరణానికి మద్యం కారణం కాదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. వారిద్దరూ అనారోగ్య కారణాలతోనే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారని అన్నారు. నాంచారయ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వివరించినట్లు పేర్కొన్నారు. మరొకరికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని చెప్పారు.

ఉద్రిక్తత..
అనగాని సత్యప్రసాద్ హౌస్ అరెస్ట్ వార్తలతో రేపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. గృహ నిర్బంధంలోకి తీసుకునే సమయంలో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. దీనితో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications