ఆ టీడీపీ ఎమ్మెల్యే వీడియో ఇదే..!!
MLA BV Jaya Nageshwar Reddy: కర్ణాటకలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యామ్ గేట్ ఒక్కసారిగా తెగిపోయింది. వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. ఫలితంగా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీని ప్రభావం తెలంగాణ, ఏపీల్లోని రిజర్వాయర్లపై పడే అవకాశం లేకపోలేదు.
ఇటీవల కర్ణాటకలో తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కొప్పళ తాలూకాలోని మునీరాబాద్ వద్ద ఆ నదిపై నిర్మించిన భారీ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గరిష్ఠ మట్టానికి చేరుకుంది. అటు ఇన్‌ఫ్లో భారీగా ఉంటోండటంతో గేట్లను ఎత్తివేశారు జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

అదే సమయంలో రిజర్వాయర్‌కు చెందిన 19వ క్రస్ట్ గేటు చైన్ తెగింది. ఫలితంగా గేటు విరిగిపడింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నీటి ఒత్తిడిని తట్టుకోలేక చైన్ తెగడం, ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల గేట్ ఊడి కిందపడటం వంటి పరిణామాలు సంభవించాయి.
గేటు తెగిపోవడంతో రిజర్వాయర్ వద్ద లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహించింది. వరద వెల్లువెత్తడంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొప్పళ ఎమ్మెల్యే కే రాఘవేంద్ర హిట్నాల్.. హుటాహుటిన రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
దీని ప్రభావం తెలంగాణ, ఏపీల్లో రిజర్వాయర్లపై పడింది. లక్ష క్యూసెక్కుల వరకు వరదనీరు వచ్చి చేరుతోండటం పట్ల దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లపై దీని ఒత్తిడి పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తీర ప్రాంతాలన్నీ మునిగిపోతాయనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
దీనిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, పుకార్లను విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితులపై తనతో పాటు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులందరితో మాట్లాడామని, ఎలాంటి ముప్పు లేదని వారు వివరించినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం గేటు పునః నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని, మూడు నుంచి నాలుగు రోజుల్లోగా దాన్ని అమర్చుతారని పేర్కొన్నారు.
రెండు వారాల కిందటే 1.15 లక్షల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేశారని, అప్పుడే ఎలాంటి ముప్పూ ఏర్పడలేదని బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినా కూడా నష్టం జరగబోదని హామీ ఇచ్చారాయన.












Click it and Unblock the Notifications