
"గాడ్ ఫాదర్" తో గంటా భేటీ - విశాఖ కేంద్రంగా కొత్త సమీకరణాలు..!!
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన..ఆయన పార్టీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. ఆయన పార్టీ మారుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. మధ్యలో వైసీపీ ముఖ్య నేతలు గంటా పార్టీ మార్పు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు విశాఖ చుట్టూ తిరుగుతున్నాయి, విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని డిమాండ్ చేస్తూ రాజీనామాలకు సిద్దమని వరుస ప్రకటనలు చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

చిరంజీవితో గంటా సన్నిహిత సంబంధాలు
ఈ సమయంలో విశాఖ నగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా - చిరంజీవితో సమావేశమయ్యారు. గతంలోనూ పలు సందర్భాల్లో చిరంజీవితో గంగా భేటీ అయ్యారు. ప్రజారాజ్యంలో.. ఆ తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా- గంటా ఏపీ మంత్రిగా కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 ఎన్నికల సమయంలో గంటా టీడీపీలో చేరి పార్టీ అధికారంలోకి రావటంతో మంత్రి అయ్యారు. కొద్ది రోజుల క్రితం వరకూ విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రంగా సాగింది. ఆ సమయంలో పోరాటం చేస్తున్న కార్మికులకు మద్దతుగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కార్మికులకు మద్దతుగా విశాఖలో సభ నిర్వహించారు.

విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు
ఇప్పటి వరకు ఆ రాజీనామా పైన నిర్ణయం రాలేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామా లేఖలను సిద్దం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన నాన్ జేఏసీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖ అందించారు. అవసరమైతే తాము రాజీనామాకు సిద్దమని మంత్రి కారుమూరు..మాజీ మంత్రి అవంతి ప్రకటించారు. ఇప్పుడు చిరంజీవి రాజకీయంగా తమ్ముడు పవన్ కు తన మద్దతు ఉంటుందంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో..వచ్చే ఎన్నికల్లో చిరంజీవి తిరిగి పవన్ కు మద్దతుగా ప్రచారంలోకి దిగే ఛాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక, ఇదే సమయంలో పొత్తుల అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ
ఈ సమయంలో చిరంజీవితో గంటా శ్రీనివాసరావు భేటీ ఆసక్తి కరంగా మారింది. అయితే, గాడ్ ఫాదర్ సక్సెస్ తో అభినందించేందుకే గంటా కలిసినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. గంటా మరో వైపు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు నిర్వహిస్తున్న సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. రాజకీయంగా కాపు వర్గానికి ప్రాధాన్యత దక్కేలా అడుగులు వేయటం ఈ సమావేశాల ప్రధాన అజెండా. దీంతో..ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న గంటా శ్రీనివాస రావు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో చిరంజీవిని కలవటం హాట్ టాపిక్ గా మారింది.