సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా పరిపాలన సాగిస్తుంది అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తుంటే, టిడిపికి చెందిన ఒక ఎమ్మెల్యే చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు తిరువూరు టిడిపి ఎమ్మెల్యే. అధికారులు తీరుపై వినూత్నంగా నిరసన తెలియజేస్తూ పెద్ద సినిమానే క్రియేట్ చేశారు.
వర్షంలో వినూత్న నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే
తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిన్న తిరువూరు పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో వార్డులో రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి రోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకోవడానికి వారి కోసం గంట పాటు వర్షంలోనే నిరీక్షించారు. వర్షంలో తడుస్తూ అధికారులు తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

గుంతల వద్ద స్టూల్ వేసుకుని వర్షంలో తడుస్తూ నిరసన
వర్షంలో రోడ్డు మధ్యలో గుంతల వద్ద స్టూల్ వేసుకొని కూర్చుని తన నిరసనను వ్యక్తం చేశారు. గుంతలను ఎందుకు పూడ్చలేదంటూ రోడ్లు భవనాల శాఖ అధికారులు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రోడ్లపై గుంతలు పూడ్చడం లేదంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం
తిరువూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆర్ అండ్ బి రహదారి మధ్యలో స్టూల్ వేసుకుని కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆయన వర్షాలకు రోడ్లన్నీ మునుగుతున్నా, డ్రైనేజీలు సరిగా లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆయన మురుగు కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.
బురదలో నిలబడి నిరసన
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2024
రోడ్డుపై గుంతలు పూడ్చలేదని.. బురదలో నిలబడి అధికారులపై నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి pic.twitter.com/zvlea4fVCw
ఏపీలో చర్చనీయాంశంగా కొలికపూడి తీరు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు అధికార పక్షంలో కూడా ఆయన అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే తిరువూరు పట్టణంలో సంచరించడంతో స్థానికులు కూడా ఎమ్మెల్యేకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రోడ్లు మరమ్మతులు చేయడం లేదని వాపోయారు. దీనిపై అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రోడ్ల మరమ్మతులకు మంజూరైన నిధులు ఏమయ్యాయి అంటూ అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబుకు కొలికపూడితో తలనొప్పి
ఎప్పటిలోగా మరమ్మతులు పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. ఏది ఏమైనా కొలికపూడి శ్రీనివాసరావు తన అనాలోచిత నిర్ణయాలతో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాన్ని అందిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగా తయారవుతున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు దూకుడు చర్యలు వద్దని హెచ్చరించినా మళ్ళీ కొలికపూడి అదే బాటలో వెళ్ళటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.












Click it and Unblock the Notifications