మహానాడు మర్నాడే బాబుకు కేసీఆర్ షాక్: టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే కృష్ణారావు
హైదరాబాద్: రాజధానికి చెందిన మరో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మహానాడు పూర్తై 24 గంటలు గడవకముందే, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల ముందు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తెరాసలో చేరారు.
కృష్ణారావు శనివారం నాడు మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. మండలి ఎన్నికల్లో అయిదో అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా కృష్ణారావును తెరాస అభ్యర్థులు కలిసి ఒప్పించారని తెలుస్తోంది. మండలి ఎన్నికల్లో ఆయన తెరాస అభ్యర్థికే ఓటు వేయనున్నారు.

మహానాడు వేదిక పైనుంచి తమ జోలికొస్తే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించి 24 గంటలు గడిచాయో లేదో కృష్ణారావు చేజారిపోవడం గమనార్హం. కేసీఆర్‌ను ఆయన ఫామ్‌హౌస్‌లో కలుసుకుని తెరాస తీర్థం తీసుకున్నారు.
తెరాస చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై నియోజకవర్గం అభివృద్ధి కోసం తెరాసలో చేరినట్లు కృష్ణారావు వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో పేదప్రజలకు ఎలాంటి సహకారం అందించలేకపోతున్నానని, కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణారావుకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications