‘అల్లుడు టాక్స్’: పవన్ కళ్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ లీగల్ నోటీసులు పంపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో తాను అవినీతికి పాల్పడినట్లు పవన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.
వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, కాశీబుగ్గలో మంగళవారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ.. పలాస ఎమ్మెల్యే అవినీతికి పాల‍్పడుతున్నారని, పలాస ప్రజలకు అల్లుడు టాక్స్ పడుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే.

'ఇటీవల జీఎస్టీ విన్నాం.. కాని పలాసలో మాత్రం అదనంగా అల్లుడు టాక్స్ కట్టాలట' అని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ ఆరోపణలపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేశారంటూ ధ్వజమెత్తారు.
ఇది ఇలా ఉంటే, కాశీబుగ్గలో మంగళవారం జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభా ప్రాంగణాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్దిచేశారు. పవన్ రాకతో సభా ప్రాంగణం అపవిత్రం అయ్యిందని, అందుకే పసుపు నీళ్లతో శుద్దిచేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు.












Click it and Unblock the Notifications