బాబును ఆహ్వానించమన్నాం, టైం అడిగారు: యనమల
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా తాము రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరామని టిడిపి శాసన మండలి నేత యనమల రామకృష్ణుడు గురువారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎమ్మెల్యేలు మధ్యాహ్నం గవర్నర్‌ను కలిశారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడారు.

తాము చంద్రబాబు నాయుడును తమ పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రమాణ స్థలం, తేదీ, సమయం ఇవ్వాలని ఆయన తమను అడిగారన్నారు. సాయంత్రం తాము వివరాలు గవర్నర్‌కు అందిస్తామని చెప్పారు.
తాము టిడిపి శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నామని, దీనికి సంబంధించిన వివరాలను ఆయనకు అందచేశామన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా యువగర్జన జరిగిన ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గవర్నర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిస్తారని చెప్పారు.

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎపిలో టిడిపి 102 స్థానాలను గెలుచుకుంది. టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి నాలుగు స్థానాలలో గెలుపొందింది.












Click it and Unblock the Notifications