టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు : స్పీకర్ విచారం..!!
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ రోజు సమావేశాల ప్రారంభం సమయంలో టీడీపీ మరోసారి జంగారెడ్డి గూడెం ఘటన పైన చర్చకు పట్టుబట్టింది. అయితే, ఒక సారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తరువాత మరోసారి అదే అంశం పైన చర్చకు అవకాశం లేదని స్పీకర్ స్పష్టం చేసారు. అయినా, టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. వారి పైన ఆర్దిక మంత్రి బుగ్గన..చీఫ్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు.
Recommended Video

టీడీపీ సభ్యుల ఆందోళన
ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న వేళ..టీడీపీ సభ్యుల ఆందోళన సైతం కంటిన్యూ అయింది. దీంతో.. టీడీపీ సభ్యుల తీరును స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. బడ్జెట్ ప్రసంగం పైన సభలో తిరిగి చర్చ ప్రారంభించే వేళ..టీడీపీ సభ్యులు మరోసారి సభలో ఆందోళనకు దిగారు. దీంతో..సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన అంశం పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చిందని చెప్పారు.

సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
అక్కడ సహజ మరణాలను కల్తీ సారా కారణంగా మరణించారనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జంగారెడ్డి గూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక వైపు మద్యం అమ్మాలు పెంచామని విమర్శిస్తూనే.. మరో వైపు కల్తీ సారాయిని ప్రోత్సహిస్తున్నామని చెప్పటం పైన సీఎం ప్రశ్నించారు. తాను సహజంగా మరణాల రేటు గురించి ప్రస్తావించానని..దానిని సైతం వక్రీకరించే ప్రయత్నం చేసారని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత కల్తీ సారా.. బెల్టు షాపులను తొలిగించామని.. ప్రభుత్వం ఏ విషయంలోనూ అక్రమార్కులకు అండగా నిలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సభలో టీడీపీ సభ్యులు బడ్జెట్ పైన చర్చకు సహకరించాలని కోరారు.

ఒక రోజు కోసం సస్పెన్షన్
టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. అయినా. .టీడీపీ సభ్యులు తమ నినాదాలు కొనసాగించటంతో.. దీంతో టీడీపీ సభ్యులను ఈ రోజు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.
దీనికి సభ ఆమోదం తెలపటంతో వారిని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అయిదుగురు టీడీపీ సభ్యులను ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేస్తూ సభలో నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఈ మధ్నాహ్నం సభ ముగిసిన తరువాత వైసీపీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications