లోకేశ్ కోసం మేముసైతం: ఎమ్మెల్సీకి బుద్ధా రాజీనామా, రేపు బాబుని కలుస్తా?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు త్యాగాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. నారా లోకేశ్ కోసం మేం రాజీనామా చేస్తామంటే మేం రాజీనామా చేస్తామంటూ ప్రకటనలను గుప్పిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లోకేశ్ కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బుద్దా వెంకన్న అన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సొంతజిల్లా నుంచి లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే నా స్థానంలో లోకేశ్‌ను ఎమ్మెల్సీగా నిలబెట్టాలని సూచించారు. నా రాజీనామా విషయాన్ని రేపు చంద్రబాబును కలిసి తెలియజేస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు.

బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి వంటి నాయకులు పొత్తు ధర్మాన్ని విస్మరించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టం వల్లే టీడీపీ గెలిచిందని ఆయన చెప్పారు. మరోవైపు లోకేశ్ కోసం రాజీనామాకు సిద్ధమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆయన ఆకాంక్షించారు. లోకేష్ లాంటి యువనాయకుల అవసరం పార్టీకి ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. లోకేశ్‌ను ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అభ్యన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ అవసరం రాష్ట్రానికి ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లోకి లోకేష్‌ను తీసుకోవాలన్న నిర్ణయాన్నితాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications