చిత్తూరు పరువు తీసిన రోజా: గాలి, వైసిపినుంచి వస్తే తప్పేంటి: బిజెపి మంత్రిXటిడిపి నేత
అనంతపురం/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో తన అసభ్యపు పదజాలంతో చిత్తూరు జిల్లా పరువు, మహిళల పరువు తీశారని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం ధ్వజమెత్తారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్‌లో ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే ఉన్నారని ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ సంస్కృతి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌వేనని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును రోజా కామ సీఎం అనడం ఆమె స్థాయికి తగింది కాదన్నారు.
కీచకులను కాపాడొద్దు: నారాయణ
సంచలనం సృష్టించిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ కేసును ఏపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. కాల్ మనీ కేసును పక్కదోవ పట్టించేందుకు వడ్డీ వ్యాపారుల పైన పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు.

కాల్ నీ సెక్స్ రాకెట్‌ను, ప్రయివేటు ఫైనాన్సును ఒకే గాటాన కట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వడ్డీల పేరుతో మహిళలను వేధించిన కీచకులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.
పోలవరం మూడేళ్లలో పూర్తి చేయాలి: రఘువీరా
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువరా రెడ్డి మంగళవారం నాడు డిమాండ్ చేశారు. రబీలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్నారు. రుణమాఫీ అమలు కాక గిట్టుబాటు ధర రాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా పైన గర్జించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చి ఆంధ్రులను మోసం చేసిందన్నారు. ఉద్యమాలు చేసి అయినా ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు సాధిస్తామన్నారు.
బిజెపిలో విభేదాలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బిజెపి - టిడిపిల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి మాణిక్యాల రావు, జెడ్పీ బాపిరాజు మధ్య వాగ్వాదం జరిగింది.
మంత్రి శిద్ధా రాఘవ రావు సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. టిడిపి నేతల ఇళ్లకు వెళ్లకుండా వైసిపి నుంచి బిజెపిలో చేరిన నేతల ఇళ్లకు వెళ్తున్నారని మంత్రిని బాపిరాజు ప్రశ్నించారు. వైసిపి నేతలను టిడిపిలోకి తీసుకుంటున్నప్పుడు బిజెపిలో చేర్చుకుంటే తప్పేమిటని మంత్రి మాణిక్యాల రావు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications